GST : పాలు, పెన్సిళ్లపై కూడా జీఎస్టీ.. పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చిన ఆర్థిక మంత్రి
పార్లమెంట్‌లో క్లారిటీ ఇచ్చిన ఆర్థిక మంత్రి
GST : లోక్‌సభలో ఇటీవల జీఎస్‌టీ అంశంపై జరిగిన చర్చ రాజకీయ సెగలు పుట్టించింది. పాలు, పెన్సిళ్లు, చివరకు అంత్యక్రియలపై కూడా ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తోందని ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిప్పులు చెరిగారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వాస్తవాలను వక్రీకరించడం సరికాదని, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆమె గట్టిగా హెచ్చరించారు. అసలు ఏ వస్తువులపై పన్ను ఉంది? వేటిపై లేదు? అనే అంశంపై ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఇక్కడ ఉంది.
పాలు, డైరీ ఉత్పత్తులపై జీఎస్‌టీ ఉందా?
పాలకు సంబంధించి వస్తున్న ఆరోపణలను ఆర్థిక మంత్రి తీవ్రంగా ఖండించారు. 2017లో జీఎస్‌టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పాలు పై ఒక్క రూపాయి కూడా పన్ను విధించలేదని ఆమె స్పష్టం చేశారు. పాలు పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ అని వెల్లడించారు. అంతేకాకుండా, గత సెప్టెంబర్ 3, 2025న జరిగిన 56వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో నెయ్యి, వెన్న, పన్నీర్ వంటి ఉత్పత్తులపై ఉన్న పన్నును 12% నుండి 5%కి తగ్గించి సామాన్యులకు ఊరటనిచ్చామని గుర్తు చేశారు.
చదువు, పెన్సిళ్లపై పన్ను ఎంత?
పాఠశాల విద్యపై పన్ను ఉందన్న వాదనలో నిజం లేదని సర్కార్ తేల్చేసింది. ప్రీ-స్కూల్ నుంచి హయ్యర్ సెకండరీ వరకు, అలాగే గుర్తింపు పొందిన డిగ్రీ కోర్సులపై జీఎస్‌టీ సున్నా. విద్యార్థులు వాడే పెన్సిళ్లు, షార్పనర్లు, ఎరేజర్లు, నోట్ బుక్స్, మ్యాప్స్‌పై కూడా ఎటువంటి పన్ను లేదని నిర్మలా సీతారామన్ వివరించారు. అయితే, కోచింగ్ సెంటర్లు, ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులు, విలాసవంతమైన స్టేషనరీ వస్తువులపై (ఖరీదైన పెన్నులు, మార్కర్లు) మాత్రం నిబంధనల ప్రకారం పన్ను వర్తిస్తుంది.
వైద్య సేవలు, బీమా, అంత్యక్రియలు
ఆరోగ్య సేవలపై పన్ను వసూలు చేస్తున్నారన్న వాదనపై కూడా మంత్రి స్పష్టత ఇచ్చారు. డాక్టర్ల ఫీజులు, నర్సుల సేవలు, రోగుల సంరక్షణపై 0% జీఎస్‌టీ ఉందని ఆమె తెలిపారు. అయితే ఆసుపత్రిలో ఐసీయూ కాకుండా రోజుకు రూ.5,000 కంటే ఎక్కువ అద్దె ఉన్న గదులకు మాత్రం పన్ను కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ జెన్ జీఎస్‌టీ సంస్కరణల ద్వారా హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను కూడా 0% జీఎస్‌టీ స్లాబ్‌లోకి తీసుకువచ్చారు. ఇక అంత్యక్రియల సేవలపై జీఎస్‌టీ ఉందన్నది కేవలం కట్టుకథేనని, చావుపై కూడా పన్ను వేసే ఆలోచన ప్రభుత్వానికి ఎప్పుడూ లేదని ఆమె కడిగిపారేశారు.
వాస్తవాలు తెలుసుకోవడం ముఖ్యం
రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా, ఏ వస్తువుపై ఎంత పన్ను ఉందో తెలుసుకోవడం పౌరులుగా మన బాధ్యత. బ్రాండెడ్ ఉత్పత్తులు, విలాసవంతమైన వస్తువులపై పన్నులు ఉండటం సహజం. కానీ ప్రాథమిక అవసరాలైన పాలు, ప్రాథమిక విద్య, వైద్య సేవల విషయంలో ప్రభుత్వం పన్ను రహిత విధానాన్ని అనుసరిస్తోంది. తప్పుడు సమాచారాన్ని నమ్మి ఆందోళన చెందవద్దని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.