Gulf Crisis : గల్ఫ్ కల చెదిరింది.. స్వదేశం బాట పట్టిన భారతీయ ప్రొఫెషనల్స్
స్వదేశం బాట పట్టిన భారతీయ ప్రొఫెషనల్స్
Gulf Crisis : గల్ఫ్ దేశాలంటే ఒకప్పుడు భారతీయులకు అదో కలల ప్రపంచం. భారీ జీతాలు, విలాసవంతమైన జీవితం, ఉజ్వల భవిష్యత్తుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మిడిల్ ఈస్ట్.. ఇప్పుడు యుద్ధం దెబ్బకు వణికిపోతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నడుస్తున్న భీకర పోరు అక్కడ దశాబ్దాలుగా సెటిల్ అయిన భారతీయ ప్రొఫెషనల్స్‌ను కలవరపెడుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకడం కంటే, ఉన్న ఊరికి వెళ్లిపోవడమే మేలని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల నుంచి కంపెనీల సీఈఓల వరకు అందరూ ఇప్పుడు రివర్స్ గేర్ వేస్తున్నారు. గల్ఫ్ కల చెదిరిపోవడంతో వారంతా ఇప్పుడు తమ మాతృభూమి వైపు ఆశగా చూస్తున్నారు.
ఒకప్పుడు మిడిల్ ఈస్ట్ అంటే అత్యంత సురక్షితమైన ప్రాంతం అనే నమ్మకం ఉండేది. కానీ ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఆ నమ్మకాన్ని తుడిచేశాయి. ఎగ్జిక్యూటివ్ సెర్చ్ ఫర్మ్స్ (ఉద్యోగాల వేట సాగించే సంస్థలు) ఇస్తున్న రిపోర్ట్స్ ప్రకారం.. గత కొద్ది రోజుల్లోనే గల్ఫ్ దేశాల నుంచి ఇండియాలో ఉద్యోగాల కోసం ఆరా తీస్తున్న వారి సంఖ్య 30 శాతం పెరిగింది. ట్రాన్స్‌సర్చ్ ఇండియా వంటి సంస్థల ప్రతినిధులు చెబుతున్న దాని ప్రకారం.. గతంలో ఇండియాలో పెద్ద ఆఫర్లు వచ్చినా కాదనుకున్న సీనియర్ అధికారులు కూడా, ఇప్పుడు యుద్ధం మొదలవ్వగానే ఏదో ఒక ఉద్యోగం ఇప్పించండి.. మేము దేశం వచ్చేస్తాం అని రిక్వెస్ట్ చేస్తున్నారు. కుటుంబ భద్రత ముందు భారీ జీతాలు దిగదుడుపేనని వారు భావిస్తున్నారు.
దుబాయ్, ఖతార్ వంటి దేశాల్లో ఇప్పుడు భయం నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్‌లో పనిచేసే ఉద్యోగులకు ఇటీవల ప్రాణహాని హెచ్చరికలు రావడం, అక్కడ ఒక ఇరానియన్ డ్రోన్ శకలాలు పడటం వంటి సంఘటనలు స్థానికంగా ఉన్న భారతీయులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. బాల్కనీల్లోకి రావద్దని, కిటికీలకు దూరంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం పౌరులకు పదే పదే అలర్ట్ పంపిస్తోంది. ఖతార్‌లో ఉన్న టెక్ ప్రొఫెషనల్స్ కూడా తమ వృద్ధ తల్లిదండ్రుల ఆందోళన చూసి ఇండియాకు తిరుగు ప్రయాణం కడుతున్నారు. పదేళ్ల కిందట ఉన్న ప్రశాంతత ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో మచ్చుకైనా కనిపించడం లేదని వారు వాపోతున్నారు.
అయితే, భారతీయులు వెనక్కి రావడానికి కేవలం భయం మాత్రమే కారణం కాదు.. ఇండియాలో పెరుగుతున్న ఆర్థిక అవకాశాలు కూడా ఒక ప్రధాన కారణం. గతంలో గల్ఫ్ దేశాల్లో వచ్చే జీతానికి, ఇండియాలో ఇచ్చే శాలరీకి మధ్య కొండంత తేడా ఉండేది. కానీ ఇప్పుడు భారత్ ఆర్థికంగా బలోపేతం కావడంతో, ఇక్కడి కంపెనీలు కూడా అంతర్జాతీయ స్థాయి ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ రాకతో ప్రపంచ స్థాయి లీడర్‌షిప్ రోల్స్ ఇప్పుడు ఇండియా నుంచే ఆపరేట్ అవుతున్నాయి. దీంతో ప్రొఫెషనల్స్‌కు గల్ఫ్ డ్రీమ్ కంటే ఇండియా సక్సెస్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. యుద్ధం ఒక కారణమైతే, దేశంపై ఉన్న నమ్మకం మరో కారణమైంది.