H-1B Visa System : అమెరికా వీసా పాలసీలో మార్పులు.. హెచ్1బీ వీసా రద్దు అవుతుందా?
హెచ్1బీ వీసా రద్దు అవుతుందా?;
H-1B Visa System : అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ప్రధాన ఆధారం H1B వీసా. అయితే ఇప్పుడు ఈ వీసా సిస్టమ్ ఒక మోసం అని అమెరికా తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. ట్రంప్ ప్రభుత్వం H1B వీసా, గ్రీన్ కార్డ్ సిస్టమ్ లో పెద్ద మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. దీనిపై అమెరికా వాణిజ్య విభాగం కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ సంకేతాలు ఇచ్చారు. ఈ H1B వీసా సిస్టమ్ ఒక స్కామ్ అని ఆయన అభివర్ణించారు.
లాటరీ బదులు కొత్త విధానం
ప్రస్తుతం H1B వీసా జారీ అనేది లాటరీ పద్ధతిలో జరుగుతోంది. అయితే ఈ పద్ధతిలో మార్పులు తీసుకురావాలని అమెరికా భావిస్తోంది. దీని ప్రకారం, వీసా జారీ చేయడానికి జీతం, నైపుణ్యం వంటి వివిధ అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారని లుట్నిక్ చెప్పారు. అధిక జీతం ఉన్న వారికి తొలి ప్రాధాన్యత ఇస్తారని కూడా ఆయన అన్నారు. గ్రీన్ కార్డుల జారీలో కూడా ఇదే తరహాలో మార్పులు తీసుకురావాలని చూస్తున్నారని తెలిపారు. ఈ మార్పుల ఉద్దేశ్యం విదేశీ ఉద్యోగుల రాకను తగ్గించి, అమెరికాలోని స్థానిక ఉద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించడమేనని ఆయన వివరించారు.
భారతీయులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?
H1B వీసా అనేది విదేశాల నుంచి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను అమెరికాకు తీసుకురావడానికి అనుమతించే ఒక సిస్టమ్. ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట సంఖ్యలో H1B వీసాలు జారీ అవుతాయి. వాటిలో ఎక్కువ శాతం భారతీయులకే లభిస్తాయి.
అమెరికా కంపెనీలు తమ స్థానిక ఉద్యోగులకు ఎక్కువ జీతం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి, H1B వీసా ద్వారా తక్కువ జీతానికి విదేశీ ఉద్యోగులను నియమించుకుంటాయి. ముఖ్యంగా ఐటీ, టెక్ రంగంలో భారతీయ టెకీలు ఎక్కువ నైపుణ్యం కలిగి ఉండటంతో వారికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. ఇప్పుడు H1B వీసా వ్యవస్థలో జీతం ప్రాతిపదికన మార్పులు తీసుకొస్తే, కంపెనీలు తక్కువ జీతానికి విదేశాల నుంచి ఉద్యోగులను తీసుకురావడం కష్టమవుతుంది. దాంతో స్థానిక ఉద్యోగులను నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మార్పులు అమలులోకి వస్తే అమెరికాకు వెళ్లాలనుకునే ఎంతోమంది భారతీయులకు నిరాశ తప్పదు. అలాగే అమెరికన్ కంపెనీలకు కూడా జీతాల భారం పెరుగుతుంది.