HDFC Bank FD Rates : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు పండగే.. ఎఫ్డీలపై పెరిగిన వడ్డీ రేట్లు
ఎఫ్డీలపై పెరిగిన వడ్డీ రేట్లు
HDFC Bank FD Rates : సేవింగ్స్ చేసేవారికి, ముఖ్యంగా మధ్యతరగతి పెట్టుబడిదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది ఎప్పుడూ ఒక భరోసా. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా కచ్చితమైన లాభం రావాలని కోరుకునే వారి కోసం దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన కొన్ని కాలపరిమితులపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్లు మార్చి 6, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. రూ.3 కోట్ల కంటే తక్కువ ఉన్న డిపాజిట్లపై ఈ పెంపు వర్తిస్తుందని బ్యాంక్ ప్రకటించింది.
ఏ కాలపరిమితిపై ఎంత పెరిగింది?
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అన్ని రకాల ఎఫ్డీలపై కాకుండా, ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే వడ్డీని పెంచింది. 3 ఏళ్ల 1 రోజు నుంచి 4 ఏళ్ల 7 నెలల లోపు కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై 10 బేసిస్ పాయింట్లు (0.10 శాతం) వడ్డీని పెంచింది. దీనివల్ల గతంలో సాధారణ ప్రజలకు ఉన్న 6.40 శాతం వడ్డీ ఇప్పుడు 6.50 శాతానికి చేరింది. అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీని 6.90 శాతం నుంచి ఏకంగా 7 శాతానికి పెంచింది. గత ఏడాది డిసెంబర్‌లో వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంక్, ఇప్పుడు మళ్ళీ పెంచడంతో డిపాజిటర్లకు ఊరట లభించింది.
వివిధ కాలపరిమితులపై తాజా వడ్డీ రేట్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుతం 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు రకరకాల ప్లాన్లను ఆఫర్ చేస్తోంది.
స్వల్ప కాలానికి (7-29 రోజులు): సాధారణ వ్యక్తులకు 2.75%, సీనియర్ సిటిజన్లకు 3.25%.
మధ్యస్థ కాలానికి (6-9 నెలలు): సాధారణ వ్యక్తులకు 5.50%, సీనియర్ సిటిజన్లకు 6%.
ఏడాది కాలానికి: సాధారణ వ్యక్తులకు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.75%.
దీర్ఘకాలానికి (5-10 ఏళ్లు): సాధారణ వ్యక్తులకు 6.15%, సీనియర్ సిటిజన్లకు 6.65%.
మీరు 18 నెలల నుంచి 2 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేస్తే సాధారణ ప్రజలకు 6.45%, వృద్ధులకు 6.95% వరకు రిటర్న్స్ లభిస్తాయి.
సీనియర్ సిటిజన్లకు గోల్డెన్ ఆఫర్
ఎప్పటిలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వృద్ధులకు అదనపు వడ్డీని అందిస్తోంది. సాధారణ పౌరుల కంటే వీరికి 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. తాజా మార్పులతో కొన్ని కాలపరిమితులపై వృద్ధులు ఏకంగా 7 శాతం వరకు లాభాన్ని పొందవచ్చు. రిటైర్మెంట్ తర్వాత తమ సొమ్మును సురక్షితంగా దాచుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. పైగా ప్రైవేట్ రంగంలో నమ్మకమైన బ్యాంక్ కావడంతో ఇన్వెస్టర్లు దీనివైపు మొగ్గు చూపుతున్నారు.
ఇన్వెస్ట్ చేసే ముందు గుర్తుంచుకోండి
ఫిక్స్‌డ్ డిపాజిట్ అనేది రిస్క్ లేని పెట్టుబడి మార్గం అయినప్పటికీ, డబ్బులు దాచే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. కేవలం ఒక్క బ్యాంకులోనే కాకుండా ఇతర బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లతో పోల్చి చూడండి. మీ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కాలపరిమితిని ఎంచుకోండి. అత్యవసరంగా డబ్బులు వెనక్కి తీసుకోవాల్సి వస్తే పెనాల్టీలు ఎంత ఉంటాయో కూడా తెలుసుకోవడం మంచిది. సరైన ప్లాన్ ఎంచుకుంటేనే మీ కష్టార్జితానికి తగిన ఫలితం దక్కుతుంది.