HDFC Bank Shares Crash : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ల ఊచకోత.. ఒక్క రోజే రూ.లక్ష కోట్లు మాయం
ఒక్క రోజే రూ.లక్ష కోట్లు మాయం
HDFC Bank Shares Crash : భారత బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇన్వెస్టర్లకు నేడు కోలుకోలేని షాక్ తగిలింది. మార్కెట్ ప్రారంభమైన నిమిషాల్లోనే ఈ బ్యాంక్ షేర్లు పేకమేడల్లా కూలిపోయాయి. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఏకంగా ఒక లక్ష కోట్ల రూపాయల సంపద ఆవిరైపోవడంతో దలాల్ స్ట్రీట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ భారీ పతనానికి కారణం కేవలం మార్కెట్ ఒడిదుడుకులు మాత్రమే కాదు, బ్యాంక్ మేనేజ్‌మెంట్‌లో చోటుచేసుకున్న ఒక అనూహ్య పరిణామం ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పార్ట్ టైమ్ ఛైర్మన్, ఇండిపెండెంట్ డైరెక్టర్ అతాను చక్రవర్తి తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేయడం మార్కెట్లో పెను దుమారం రేపింది. కేవలం వ్యక్తిగత కారణాలతో కాకుండా, తన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్న అంశాలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. గత రెండేళ్లుగా బ్యాంక్‌లో అనుసరిస్తున్న కొన్ని పనితీరు పద్ధతులు తన వ్యక్తిగత విలువలు, నైతికతతో ఏకీభవించడం లేదని ఆయన స్పష్టం చేశారు. బ్యాంకింగ్ రంగంలోని ఒక అత్యున్నత స్థాయి అధికారి నైతికత గురించి ప్రస్తావిస్తూ తప్పుకోవడం అంటే, బ్యాంక్ అంతర్గత పరిపాలనలో ఏదో లోపం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతర్గత కుమ్ములాటలే కారణమా?
ఈ హై ప్రొఫైల్ రాజీనామా తర్వాత, బ్యాంక్ ఉన్నత స్థాయి మేనేజ్‌మెంట్‌లో ఆధిపత్య పోరు ఏమైనా నడుస్తోందా? అనే చర్చ మొదలైంది. పరిస్థితి చేయి దాటిపోకుండా బ్యాంక్ యాజమాన్యం వెంటనే స్పందించింది. చక్రవర్తి రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాల కంటే మించి ఇతర రహస్య కారణాలేమీ లేవని వివరణ ఇచ్చింది. భారత రిజర్వ్ బ్యాంక్ అనుమతితో కెకి మిస్త్రీని తదుపరి మూడు నెలల కాలానికి తాత్కాలిక పార్ట్ టైమ్ ఛైర్మన్‌గా నియమించారు. బోర్డు సభ్యులకు, మాజీ ఛైర్మన్‌కు మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని కెకి మిస్త్రీ స్పష్టం చేసినప్పటికీ, మార్కెట్ మాత్రం దాన్ని అంత తేలికగా నమ్మడం లేదు.
కోవిడ్ క్రాష్ తర్వాత అత్యంత దారుణ పతనం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చరిత్రలో నేటి పతనం ఒక చీకటి అధ్యాయంగా నిలుస్తుంది. గతంలో 2020 మార్చి 23న కోవిడ్ భయంతో షేరు ధర 13 శాతం పడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ అంతటి దారుణమైన పతనం ఎప్పుడూ నమోదు కాలేదు. నేడు మార్కెట్ ప్రారంభంలోనే 9 శాతం నష్టంతో బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.11.85 లక్షల కోట్లకు పడిపోయింది. అయితే ఉదయం 10:20 గంటల సమయానికి కొంత రికవరీ కనిపిస్తున్నప్పటికీ, ఇంకా 5 శాతం నష్టాల్లోనే ట్రేడ్ అవుతోంది. ఈ షేర్ కీలక సపోర్ట్ లెవల్స్‌ను దాటేసి కిందకు వెళ్ళిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ మార్కెట్ వ్యూహకర్త ఆనంద్ జేమ్స్ అభిప్రాయం ప్రకారం..హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు ఇప్పుడు ప్రమాదకర స్థితిలో ఉంది. ఈ స్టాక్ ఒకవేళ రూ.810 మద్దతు స్థాయి కంటే కిందకు జారితే, పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అలా జరిగితే షేరు ధర నేరుగా రూ.748 స్థాయికి పడిపోయే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతానికి కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు కొంత కాలం వేచి చూడటం మంచిదని, బ్యాంక్ మేనేజ్‌మెంట్ నుంచి పూర్తి క్లారిటీ వచ్చే వరకు తొందరపడకూడదని మార్కెట్ పండితులు సూచిస్తున్నారు.