Healthcare Budget 2026 : హెల్త్‌కేర్ బడ్జెట్‌లో సరికొత్త రికార్డు..తొలిసారి లక్ష కోట్లు దాటిన నిధులు
తొలిసారి లక్ష కోట్లు దాటిన నిధులు
Healthcare Budget 2026 : భారతదేశ ఆరోగ్య రంగ చరిత్రలో 2026 బడ్జెట్ ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం హెల్త్‌కేర్ బడ్జెట్‌ను రూ.లక్ష కోట్లు దాటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం ఆసుపత్రులు, మందులకే పరిమితం కాకుండా.. ఈసారి మానసిక ఆరోగ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అటు వైద్యం, ఇటు టెక్నాలజీ మేళవింపుతో సామాన్యుడికి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ పద్దు రూపుదిద్దుకుంది.
కేంద్ర బడ్జెట్ 2026 ఆరోగ్య రంగంలో సరికొత్త శకానికి నాంది పలికింది. ఆరోగ్య శాఖకు కేటాయింపులు మొదటిసారి రూ.1,00,000 కోట్లు దాటడం విశేషం. ఈ భారీ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరచడమే కాకుండా, పట్టణాల్లో పెరిగిపోతున్న మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌లకు ప్రాధాన్యతనిచ్చారు. ఆధునిక కాలంలో డిప్రెషన్, యాంగ్జైటీ వంటి సమస్యలు పెరిగిపోతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, ఈ బడ్జెట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్రపై ప్రభుత్వం గట్టిగా నొక్కి చెప్పింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో జరిగిన చర్చల నేపథ్యంలో, ఏఐ అనేది కేవలం సాఫ్ట్‌వేర్ కాదని, అది దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే ఒక శక్తి అని భారత్ గుర్తించింది. ఇండియా ఏఐ మిషన్ ద్వారా దేశంలో సొంతంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు మౌలిక సదుపాయాలు, టాలెంట్, ఎనర్జీ రంగాల్లో భారీ పెట్టుబడులకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనివల్ల వైద్య రంగంలో వేగవంతమైన రోగ నిర్ధారణ సాధ్యమవుతుంది.
ముఖ్యంగా పన్నుల వ్యవస్థలో ఏఐ వాడకం విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. గత పదేళ్లలో జిఎస్‌టిఎన్, ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ వంటి డిజిటల్ వ్యవస్థలను నిర్మించిన భారత్, ఇప్పుడు ఏఐ సాయంతో పన్నుల ప్రాసెసింగ్‌ను మరింత వేగవంతం చేస్తోంది. ఐటీ నోటీసులకు సమాధానాలు సిద్ధం చేయడం, రిస్క్ అసెస్‌మెంట్ చేయడం వంటి క్లిష్టమైన పనులు ఏఐ ద్వారా సులభతరం కానున్నాయి. అయితే, టెక్నాలజీ ఎంత పెరిగినా హ్యూమన్ ఇన్ ద లూప్ అంటే మానవ పర్యవేక్షణ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. తద్వారా నిర్ణయాల్లో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.