Inflation: బ్యాంకులో రూ.లక్ష దాచిపెడితే 20 ఏళ్ల తర్వాత దాని అసలు విలువ ఎంత ఉంటుందంటే ?
ఎంత ఉంటుందంటే ?
Inflation: భవిష్యత్తు అవసరాల కోసం మనం కష్టపడి సంపాదించిన డబ్బును కూడబెడుతుంటాం. బీరువాలోనో లేక బ్యాంకు ఖాతాలోనో దాచిపెట్టిన సొమ్ము ఎప్పటికీ సురక్షితంగా ఉంటుందని చాలామంది భ్రమిస్తుంటారు. కానీ మనకు తెలియకుండానే నిశ్శబ్దంగా మన డబ్బు విలువను హారతి కర్పూరంలా కరిగిపోయేలా చేసే ఒక పెద్ద శక్తి ఉంది. అదే ద్రవ్యోల్బణం. ఇవాళ వంద రూపాయలు పెట్టి కొనే ఒక వస్తువు ధర పదేళ్లు గడిచాక అలాగే ఉంటుందని భావించడం పెద్ద పొరపాటు. కాలం మారుతున్న కొద్దీ వస్తువుల ధరలు పెరుగుతాయి. దాంతోపాటు మన దగ్గర ఉన్న సొమ్ము కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోతుంది.
20 ఏళ్ల లెక్క ఇదే
ఉదాహరణకు ఇవాళ మీ చేతిలో సరిగ్గా లక్ష రూపాయలు ఉన్నాయని అనుకుందాం. ఆ డబ్బును ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా అలాగే ఉంచితే, రాబోయే ఇరవై ఏళ్ల తర్వాత కూడా అది లక్ష రూపాయలుగానే కనిపిస్తుంది. కానీ మధ్యలో ఆరు శాతం చొప్పున సగటున ద్రవ్యోల్బణం పెరిగితే ఆ లక్ష రూపాయల అసలు విలువ కేవలం ముప్పై వేల రూపాయలకు పడిపోతుంది. అంటే ఇవాళ లక్ష రూపాయలతో ఏయే వస్తువులు వస్తాయో, అవే వస్తువులు ఇరవై ఏళ్ల తర్వాత కొనాలంటే మూడు లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. పైకి మాత్రం మన డబ్బు అలాగే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ, దాని కొనుగోలు శక్తి మాత్రం నీటిలో కరిగిన కర్పూరంలా మాయమైపోతుంది.
రిటైర్మెంట్ ప్లానింగ్
ఈ ఆర్థిక భారం సాధారణ కుటుంబాల బడ్జెట్‌పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఒక మధ్యతరహా కుటుంబం నెలవారీ ఖర్చులు యాభై వేల రూపాయలు అనుకుందాం. రాబోయే ఇరవై ఏళ్ల తర్వాత అదే జీవన శైలిని కొనసాగించాలంటే కేవలం ఇంటి ఖర్చుల కోసమే ప్రతినెల లక్షా అరవై వేల రూపాయలు అవసరమవుతాయి. కేవలం డబ్బును కూడబెట్టడం ద్వారా ఈ భారాన్ని ఎదుర్కోవడం అసలు సాధ్యం కాదు. మనకు వచ్చే పెట్టుబడి రాబడి ఎప్పుడూ ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువగా ఉండాలి. లేకపోతే మన దగ్గర ఉన్న ధనం క్షీణించి మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడతాము.