UPI: యూపీఐ పేమెంట్స్‌పై కొత్త ఛార్జీలు.. ట్రేడర్ల అసంతృప్తి వెనుక అసలు కారణం ఇదే
అసలు కారణం ఇదే
UPI: దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు అందరూ డిజిటల్ లావాదేవీల వైపు అడుగులు వేశారు. టీ కొట్టు దగ్గరి నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు క్యూఆర్ కోడ్ ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వ్యాపార వర్గాలలో తీవ్ర కలకలం రేపుతోంది. వచ్చే అక్టోబర్ 15వ తేదీ నుంచి యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్ ఫీజు వసూలు చేయనున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ట్రేడర్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
వ్యాపారులపై ఆర్థిక భారం - ఎంత కట్టాలి?
ఈ కొత్త నిబంధన సామాన్య ప్రజలకు వర్తించదు గాక వర్తించదు. కేవలం వాణిజ్య సంస్థలు అలాగే వ్యాపారాలు నిర్వహించే వారికి మాత్రమే ఈ ఛార్జీ వర్తిస్తుంది. 2000 రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో జరిగే లావాదేవీలపై ఈ ఫీజు అమలుకానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రూ. 2000 దాటిన డిజిటల్ చెల్లింపులపై 0.4 శాతం ఫీజు వసూలు చేస్తారు. ఉదాహరణకు ఎవరైనా కస్టమర్ 75000 రూపాయల లావాదేవీ చేస్తే, వ్యాపారి సుమారు 300 రూపాయల వరకు ఛార్జీ కింద చెల్లించాల్సి వస్తుంది.
జాతీయ ట్రేడర్స్ వెల్ఫేర్ బోర్డ్ తీవ్ర వ్యతిరేకత
ఈ నిబంధన అమల్లోకి వస్తే చిన్న, మధ్యతరహా వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ వ్యాపారంలో పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలపై ఈ రూపంలో అదనపు భారం పడుతుంది. అందుకే నేషనల్ ట్రేడర్స్ వెల్ఫేర్ బోర్డ్ ఈ ఫీజు విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల వ్యాపారులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే తరుణంలో ఇలాంటి ఛార్జీలు విధించడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు.