Credit Card: ఒక్క వ్యక్తి ఎన్ని క్రెడిట్ కార్డులు వాడుకోవచ్చు? బ్యాంకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
బ్యాంకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
Credit Card: నేటి ఆధునిక కాలంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోవడంతో క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగింది. అయితే ఒక వ్యక్తి వద్ద ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండాలనే దానిపై ఆర్‌బీఐ కానీ, వివిధ బ్యాంకులు కానీ ఎలాంటి గరిష్ఠ పరిమితిని విధించలేదు. సిబిల్ సంస్థ కూడా ఇన్ని కార్డులు మాత్రమే ఉండాలని ఎక్కడా స్పష్టం చేయలేదు. వ్యక్తిగత ఆదాయం, ఆర్థిక అవసరాలు, తిరిగి చెల్లించే సామర్థ్యం ప్రాతిపదికగా ఒక వ్యక్తి తన ఇష్టం వచ్చినన్ని కార్డులను పొందేందుకు అర్హత ఉంటుంది. పరిమితి లేనంత మాత్రాన ఇష్టమొచ్చినట్లు కార్డులను తీసుకోవడం శ్రేయస్కరం కాదు.
ఎక్కువ కార్డులు ఉంటే ఎదురయ్యే ముప్పు
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉండడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, నిర్వహణ లోపిస్తే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతినెల బిల్లులు చెల్లించాల్సిన గడువు తేదీలను గుర్తుంచుకోవడం కష్టంగా మారుతుంది. ఏ ఒక్క కార్డు బిల్లు గడువు దాటినా భారీగా ప్రాసెసింగ్ రుసుములు, వడ్డీ భారం పడతాయి. సాధారణంగా క్రెడిట్ కార్డులపై బ్యాంకులు ఏటా 32 శాతం నుంచి 45 శాతం వరకు అత్యధిక వడ్డీని వసూలు చేస్తాయి. అవగాహన లేకుండా ఎక్కువ కార్డులను వాడితే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.
క్రెడిట్ స్కోర్‌పై పడే ప్రభావం
క్రెడిట్ కార్డుల సంఖ్య పెరిగే కొద్దీ వ్యక్తిగత సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. ప్రతిసారి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు బ్యాంకులు మీ క్రెడిట్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. స్వల్ప వ్యవధిలోనే అనేక కార్డుల కోసం దరఖాస్తు చేస్తే మిమ్మల్ని ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న వ్యక్తిగా బ్యాంకులు భావించే అవకాశం ఉంది. అన్ని కార్డుల్లో ఉన్న పరిమితిని పూర్తిగా వాడేస్తే మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరిగిపోయి సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది. భవిష్యత్తులో హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్ కావాలనుకున్నప్పుడు బ్యాంకులు తిరస్కరించే అవకాశం ఉంది.
ఎన్ని కార్డులు వాడితే సురక్షితం?
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం సాధారణ వినియోగదారులకు ఒకటి లేదా రెండు క్రెడిట్ కార్డులు సరిపోతాయి. తమ రోజువారీ ఖర్చులు, కొనుగోళ్ల అవసరాలకు తగినట్లుగా క్యాష్‌బ్యాక్ లేదా రివార్డు పాయింట్లు ఇచ్చే కార్డును ఎంచుకోవడం మంచిది. ఒకే కార్డును క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ, ప్రతి నెలా గడువు లోపల బిల్లును పూర్తిగా చెల్లిస్తే సులభంగా ట్రాక్ చేయవచ్చు. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ పెరగడమే కాకుండా సిబిల్ స్కోర్ కూడా మెరుగవుతుంది. అవసరం లేని కార్డులను వెంటనే రద్దు చేసుకోవడం ఉత్తమం.