CIBIL Score: సిబిల్ స్కోర్ అకస్మాత్తుగా తగ్గిపోయిందా?.. ఈ చిట్కాలతో తిరిగి పెంచుకోండిలా
ఈ చిట్కాలతో తిరిగి పెంచుకోండిలా
CIBIL Score: నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితికి క్రెడిట్ స్కోర్ ఒక ముఖ్యమైన కొలమానంగా మారింది. ఇది 300 నుంచి 900 పాయింట్ల మధ్య ఉంటుంది. ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, క్రిఫ్ హైమార్క్ వంటి గుర్తింపు పొందిన సంస్థలు ఈ స్కోర్‌ను లెక్కిస్తాయి. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే దానిని ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. 650 కంటే తక్కువ ఉంటే బలహీనమైనదిగా భావిస్తారు. తక్కువ వడ్డీకే రుణాలు పొందాలన్నా, బ్యాంకుల నుంచి త్వరగా అప్రూవల్ రావలన్నా మంచి స్కోర్ ఉండటం చాలా అవసరం.
క్రెడిట్ రిపోర్టును ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి
రుణం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు మాత్రమే కాకుండా క్రమం తప్పకుండా మీ క్రెడిట్ రిపోర్టును పరిశీలించడం మంచి అలవాటు. అందులో మీ పేరు, చిరునామా, ప్రస్తుత రుణ ఖాతాలు, చెల్లించాల్సిన బాకీలు, ఇటీవలి క్రెడిట్ విచారణలను నిశితంగా గమనించాలి. మీ ప్రమేయం లేకుండా ఏదైనా కొత్త వివరాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి.
గుర్తుతెలియని రుణ ఖాతాలపై కన్నేయండి
మీరు అసలు తీసుకోని పర్సనల్ లోన్, హోమ్ లోన్ లేదా ఏదైనా ఇతర క్రెడిట్ ఖాతా మీ రిపోర్టులో కనిపిస్తే దానిని తేలిగ్గా తీసుకోకూడదు. ఇది సాంకేతిక లోపం కావచ్చు లేదా సైబర్ మోసానికి సంకేతం కావచ్చు. ఇలాంటి ఖాతాలు కనిపిస్తే వెంటనే సంబంధిత బ్యాంకు లేదా క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదు చేయడం శ్రేయస్కరం.
చెల్లింపుల చరిత్ర, ముగిసిన రుణాలు తనిఖీ చేయండి
ఈఎమ్‌ఐలు సమయానికి చెల్లించినప్పటికీ కొన్నిసార్లు రిపోర్టులో ఆలస్యంగా చెల్లించినట్లు నమోదు కావచ్చు. మీ బ్యాంకు స్టేట్‌మెంట్‌తో రిపోర్టును సరిపోల్చుకుని తప్పులను గుర్తించాలి. అలాగే మీరు పూర్తిగా చెల్లించేసిన రుణాలు రిపోర్టులో 'క్లోజ్డ్' అని ఉందో లేదో చూడాలి. ఒకే లోన్ రెండుసార్లు నమోదవ్వడం లేదా చెల్లించిన రుణం ఇంకా బాకీ ఉన్నట్లు చూపించడం వల్ల స్కోర్ దెబ్బతింటుంది.
పొరపాట్లను సవరించి స్కోర్ పెంచుకోండి
క్రెడిట్ రిపోర్టులో తప్పులు కనిపించినప్పుడు దానికి సంబంధించిన రసీదులు, ఆధారాలతో వెంటనే క్రెడిట్ బ్యూరో వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ వివాదాన్ని నమోదు చేయాలి. ఫిర్యాదు చేసిన తర్వాత దాని స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. తప్పులు సరిదిద్దబడిన తర్వాత అప్‌డేట్ అయిన నూతన రిపోర్టును పరిశీలిస్తే మీ స్కోర్ పెరిగినట్లు స్పష్టమవుతుంది.
సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి ఎల్లప్పుడూ పెద్ద ఆర్థిక మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కేవలం రిపోర్టులో ఉన్న చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకోవడం ద్వారానే మీ స్కోర్‌ను గణనీయంగా మెరుగుపరుచుకోవచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా మీ క్రెడిట్ రిపోర్టును చెక్ చేసుకుంటూ ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి.