Mutual Fund : మ్యూచువల్ ఫండ్ మ్యాజిక్.. కేవలం రూ.10లక్షల పెట్టుబడితో 1.13కోట్లు
కేవలం రూ.10లక్షల పెట్టుబడితో 1.13కోట్లు
Mutual Fund : మీరు మంచి పెట్టుబడి ఆప్షన్ కోసం చూస్తున్నారా.. లాభాలు మంచిగా రావాలని భావిస్తున్నారా.. అయితే సరైన మ్యూచువల్ ఫండ్‌లో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెడితే అది చూస్తూ చూస్తూనే భారీ మొత్తంగా మారవచ్చని ఇటీవల నిరూపితమైంది. అలాంటి అద్భుతమైన పనితీరు చూపిన ఫండ్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. అదే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్‌లో ఎవరైనా ప్రారంభంలో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టి ఉంటే అది నేడు ఏకంగా రూ.1.13 కోట్లుగా మారి ఉండేది.
మే 2008లో ప్రారంభమైన ఈ ఫండ్ ఇప్పుడు 17 ఏళ్లకు పైగా పనిచేస్తోంది. ఈ నిరంతర మంచి ప్రదర్శన కారణంగా ఈ ఫండ్ ప్రత్యేకంగా నిలుస్తోంది. లార్జ్ క్యాప్ ఫండ్ అంటే ఈ పథకం తన పెట్టుబడులను మార్కెట్ విలువ ప్రకారం దేశంలోనే టాప్-100 లో ఉన్న అతిపెద్ద కంపెనీలలో చేస్తుంది. ఈ ఫండ్ ఏ ఒక్క రంగానికీ ఎక్కువ మొగ్గు చూపకుండా, ప్రతి రంగంలోనూ మంచి భవిష్యత్తు ఉన్న కంపెనీలను ఎంచుకుంటుంది. నిజమైన లాభాల రికార్డు, మార్కెట్ నాయకత్వం, స్థిరమైన వృద్ధి సామర్థ్యం ఉన్న కంపెనీలను మాత్రమే తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకుంటామని ఫండ్ మేనేజర్లు చెబుతున్నారు.
ఈ ఫండ్ తన 17 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మార్కెట్ సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొంది. 2008 ఆర్థిక సంక్షోభం, 2013లో వడ్డీ రేట్ల పెరుగుదల, 2020లో వచ్చిన కోవిడ్-19 మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఈ ఫండ్ తక్కువ హెచ్చుతగ్గులతో దాటింది. సుదీర్ఘ కాలం పాటు పెట్టుబడిలో కొనసాగిన వారికి ఇది మంచి అనుభూతిని ఇచ్చింది. ఫండ్ మేనేజర్ అయిన అనిష్ తవాక్లే అభిప్రాయం ప్రకారం.. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల విలువలు ఇటీవల పెరిగినందున, పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుత మార్కెట్‌లో లార్జ్ క్యాప్స్ మెరుగైన రిస్క్-అడ్జస్టెడ్ రిటర్న్స్ ఇవ్వగలవని ఆయన నమ్ముతున్నారు.
ఎవరైనా ఈ ఫండ్‌లో ప్రారంభంలో (మే 23, 2008) రూ.10 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెట్టి ఉంటే అక్టోబర్ 31, 2025 నాటికి అది సుమారు రూ. 1.13 కోట్లు అయ్యేది. ఈ ఫండ్ 15% ఆకర్షణీయమైన వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది. అదే కాలంలో ఈ ఫండ్ బెంచ్‌మార్క్ అయిన నిఫ్టీ 100 ట్రైలో పెట్టుబడి పెట్టి ఉంటే కేవలం రూ.68.9 లక్షలు మాత్రమే లభించేవి, అంటే 11.3% CAGR మాత్రమే వచ్చేది.
ఒకవేళ ఎవరైనా ఈ ఫండ్ ప్రారంభం నుంచి నెలకు రూ. 10,000 చొప్పున సిప్ చేసి ఉంటే, మొత్తం రూ.21 లక్షల పెట్టుబడి అక్టోబర్ 31, 2025 నాటికి ఏకంగా రూ.95.8 లక్షలుగా మారి ఉండేది. అంటే, 15.5% రాబడి. ఈ ఫండ్ గత మూడు, ఐదేళ్ల కాలంలో కూడా తన బెంచ్‌మార్క్ కంటే 3.2% నుంచి 3.5% అధిక రాబడిని అందించింది. ఈ ఫండ్‌ను ప్రస్తుతం అనిష్ తవాక్లే, వైభవ్ దుసాద్ నిర్వహిస్తున్నారు. ఈ ఫండ్ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.75,863 కోట్లుగా ఉండటం, దీర్ఘకాలంగా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూపుతోంది.