IMF Report : ఐఎంఎఫ్ నివేదికలో మెరిసిన భారత్.. ఆర్థిక వృద్ధిలో కొనసాగుతున్న జోరు!
ఆర్థిక వృద్ధిలో కొనసాగుతున్న జోరు!
IMF Report : భారత ఆర్థిక వ్యవస్థ బలం మరోసారి ప్రపంచ వేదికపై రుజువైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తాజాగా విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదికలో భారత్ దూసుకుపోతున్న తీరును ప్రశంసించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 6.6 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇటీవల అమెరికా భారీ టారిఫ్‌లు విధించినప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం సమతుల్యంగానే ఉంటుందని ఈ నివేదిక ఆశ కల్పించడం విశేషం.
ఐఎంఎఫ్ నివేదిక ఏం చెబుతోంది?
ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.6% వృద్ధిని సాధిస్తుంది. భారతదేశం మొదటి త్రైమాసికంలో కనబరిచిన బలమైన ఆర్థిక ప్రదర్శన ఆధారంగా ఐఎంఎఫ్ ఈ అంచనాను విడుదల చేసింది. ఇటీవల అమెరికా ప్రభుత్వం భారత్‌పై భారీ టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో ఈ నివేదిక రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ టారిఫ్‌ల ప్రభావం ఇండియన్ ఎకానమీపై సమతుల్యంగానే ఉంటుందని నివేదిక సూచించడం ద్వారా ఆశలు రేకెత్తించింది.
చైనాను అధిగమించిన భారత్
వృద్ధి రేటు విషయంలో భారత్, పొరుగు దేశమైన చైనాను అధిగమిస్తుందని కూడా ఈ నివేదిక స్పష్టం చేసింది. 2025-26లో చైనా వృద్ధి రేటు 4.8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అయితే, 2026 సంవత్సరానికి మాత్రం ఐఎంఎఫ్ భారత వృద్ధి రేటు అంచనాను కొద్దిగా తగ్గించి 6.2 శాతంగా పేర్కొంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం.. మొదటి త్రైమాసికంలో కనిపించిన వేగం క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చు, కానీ ప్రపంచ సగటు కంటే భారత్ వృద్ధి చాలా బలంగా ఉంటుంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థల పరిస్థితి
ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2025లో 3.2 శాతం, 2026లో 3.1 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. అంటే, ప్రపంచ సగటు కంటే భారత వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉండనుంది. నివేదిక ప్రకారం, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల సగటు వృద్ధి రేటు 1.6 శాతంగా, వర్ధమాన ఆర్థిక వ్యవస్థల సగటు వృద్ధి రేటు 4.2 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2026లో వర్ధమాన ఆర్థిక వ్యవస్థల వృద్ధిలో 0.2 శాతం స్వల్ప తగ్గుదల ఉండవచ్చు.
ఇతర దేశాల వృద్ధి రేటు అంచనాలు
అభివృద్ధి చెందిన దేశాలలో, స్పెయిన్ అత్యంత వేగంగా (2.9%) అభివృద్ధి చెందుతుందని అంచనా. అమెరికా వృద్ధి రేటు 1.9 శాతంగా ఉంటుంది. ఇతర దేశాల విషయానికొస్తే, బ్రెజిల్ 2.4 శాతం, కెనడా 1.2 శాతం, జపాన్ 1.1 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగే అవకాశం ఉందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది.