ITR Filing : టాక్స్ పేయర్స్ అలర్ట్.. ఐటీఆర్ ఫారమ్‌లలో సరికొత్త కాలమ్ తెచ్చిన ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్

ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్

Update: 2026-07-16 11:29 GMT

ITR Filing : భారతదేశంలో ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేసే మధ్యతరగతి ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ఐటీ శాఖ కీలక సమాచారాన్ని అందించింది. పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని మరింత పారదర్శకంగా ఉంచడానికి, కమ్యూనికేషన్‌ను సులభతరం చేయడానికి వీలుగా కేంద్ర ఆదాయపు పన్ను శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్‌లలో కొత్తగా సెకండరీ అడ్రస్ అనే కాలమ్‌ను చేర్చింది. పన్ను పరిపాలనా వ్యవస్థలో డేటా ఖచ్చితత్వాన్ని పెంచే లక్ష్యంతో ఈ మార్పులు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.

ఈ సరికొత్త నిబంధన కేవలం కొందరికి మాత్రమే పరిమితం కాదు. ఉద్యోగస్తులు ఉపయోగించే ITR-1 ఫారమ్ నుంచి మొదలుకొని ప్రొఫెషనల్స్, వ్యాపారాలు, భాగస్వామ్య సంస్థలు , కంపెనీలు, ట్రస్టులు దాఖలు చేసే ITR-7 వరకు అన్ని రకాల ఐటీఆర్ ఫారమ్‌లలో ఈ సెకండరీ అడ్రస్ ఫీల్డ్‌ను జత చేశారు. పన్ను చెల్లింపుదారుల పూర్తి, వ్యవస్థీకృత సమాచారాన్ని సేకరించడానికి ఐటీ శాఖ ఈ మార్పులు చేపట్టింది. ఐటీఆర్ ఫారమ్‌లోని పార్ట్ A జనరల్ / పర్సనల్ ఇన్‌ఫర్మేషన్ విభాగంలో ఇకపై ప్రైమరీ, సెకండరీ అడ్రస్ ల కోసం విడివిడిగా కాలమ్స్ అందుబాటులో ఉంటాయి.

చాలామంది మధ్యతరగతి ప్రజలు ఉద్యోగాల రీత్యా అద్దె ఇళ్లలో నివసిస్తుంటారు, కానీ వారి సొంత ఊరిలో పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. ఇన్‌కమ్ టాక్స్ శాఖ ఏదైనా అధికారిక లేఖలు లేదా నోటీసులు పంపినప్పుడు అడ్రస్ మారడం వల్ల అవి కస్టమర్లకు చేరడం లేదు. ఈ గ్యాప్‌ను తగ్గించడానికే సెకండరీ అడ్రస్ ఆప్షన్ తెచ్చారు. సెకండరీ అడ్రస్ అంటే పన్ను చెల్లింపుదారుడు నివసించే మరో ఇల్లు, ఆఫీస్, వ్యాపార స్థలం లేదా అధికారిక సమాచారం అందుకోవడానికి వీలైన మరేదైనా సరైన చిరునామా కావచ్చు. ఒకవేళ మీకు ఒకే అడ్రస్ ఉంటే, ప్రైమరీ అడ్రస్ లో ఇచ్చిన వివరాలనే సెకండరీ అడ్రస్ లోనూ కాపీ చేయవచ్చు.

ఐటీఆర్‌లో ఇచ్చే సెకండరీ అడ్రస్ మీ పాన్ లేదా ఆధార్ రికార్డులలో అప్‌డేట్ కాకపోయినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదని పన్ను నిపుణులు చెబుతున్నారు. అడ్రస్ మ్యాచ్ కానంత మాత్రాన ఎలాంటి నోటీసులు రావు. అయితే టాక్స్ పేయర్స్ ఇచ్చే అడ్రస్ నిజమైనది, సరైనది అయి ఉండాలి. ఎందుకంటే ఐటీఆర్ సమాచారాన్ని బ్యాంకులు, కంపెనీలు, పాన్, ఆధార్ రికార్డులతో క్రాస్ వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చిరునామాలో ఏదైనా పెద్ద మార్పు ఉన్నప్పుడు ప్రభుత్వ రికార్డులలో కూడా అప్‌డేట్ చేసుకోవడం భవిష్యత్తుకు చాలా మంచిది.

ఒకవేళ పొరపాటున ఒరిజినల్ ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు సెకండరీ అడ్రస్ తప్పుగా ఇచ్చినా లేదా అసంపూర్తిగా ఎంటర్ చేసినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. పన్ను చట్టాల ప్రకారం, నిర్ణీత గడువులోగా సెక్షన్ 139(5) కింద రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేయడం ద్వారా ఈ తప్పులను సరిదిద్దుకోవచ్చు. అయితే ఒరిజినల్ రిటర్న్‌ను గడువు తేదీ లోపు ఫైల్ చేసిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కేవలం భవిష్యత్తులో వచ్చే కమ్యూనికేషన్స్ కోసం మాత్రమే అడ్రస్ మార్చాలనుకుంటే, టాక్స్ పేయర్స్ నేరుగా ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయి తమ ప్రొఫైల్‌లో చిరునామాను సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News