Independence Day 2026: స్వదేశీ రాట్నం నుంచి గ్లోబల్ చిప్స్ దాకా.. 79 ఏళ్ల లో భారత్ సాధించిన టెక్ విప్లవమిదే
79 ఏళ్ల లో భారత్ సాధించిన టెక్ విప్లవమిదే
Independence Day 2026: గాంధీజీ రాట్నం తిప్పిన నేల నుంచి నేడు ప్రపంచాన్ని శాసించే మైక్రోచిప్‌లు, కృత్రిమ మేధ తయారీ దాకా భారత్ అద్భుత ప్రయాణం సాగించింది. 79 ఏళ్ల స్వాతంత్ర్య ప్రస్థానంలో ఒకప్పుడు విదేశీ సాంకేతికత కోసం ఎదురుచూసిన మన దేశం, నేడు గ్లోబల్ డిజిటల్ లీడర్‌గా ఎలా ఎదుగుతుందో తెలిపే ప్రత్యేక కథనం..
స్వదేశీ ఉద్యమం ఇచ్చే నయా స్ఫూర్తి
1905 నాటి స్వదేశీ ఉద్యమం విదేశీ దుస్తులను బహిష్కరించి సొంత ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యంగా సాగింది. నాటి ఆర్థిక ఆత్మనిర్భరత ఆలోచనే నేటి సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక విప్లవానికి బలమైన పునాదిగా మారింది. ప్రస్తుతం దేశంలో 1.09 బిలియన్ల ఇంటర్నెట్ చందాదారులు ఉన్నారు. నాస్‌కామ్ అంచనా ప్రకారం 2026 నాటికి భారత ఐటీ, టెక్నాలజీ రంగం 315 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది. కోట్లాది మందికి నేరుగా ఉపాధిని కల్పిస్తూ ఆర్థిక రంగానికి ప్రధాన చోదక శక్తిగా నిలిచింది.
సైన్స్ అండ్ టెక్నాలజీతో వేసిన బలమైన పునాది
స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలోనే మన పాలకులు పరిశోధనలు, సాంకేతిక విజ్ఞానానికి పెద్దపీట వేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్ ఏర్పాటు, పరమాణు ఇంధన కమిషన్, డిఆర్‌డివో స్థాపన మన సార్వభౌమాధికారానికి సాంకేతిక బలాన్ని ఇచ్చాయి. 1969లో ఇస్రో ఏర్పాటు కావడం, 1975లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపడంతో భారత రోదసి ప్రయాణం వేగం పుంజుకుంది. అమిత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ టెక్నాలజీను విదేశాలు తిరస్కరించిన వేళ, స్వదేశీ పరిజ్ఞానంతోనే పరమ్ సిరీస్ సూపర్ కంప్యూటర్లను నిర్మించి ప్రపంచానికి మన సత్తా చాటాం.
ఐటీ విప్లవం.. యూపీఐ డిజిటల్ ధమాకా
1991 ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో ఐటీ రంగం ఊహించని రీతిలో దూసుకెళ్లింది. బెంగళూరు, హైదరాబాద్ నగరాలు గ్లోబల్ టెక్ హబ్‌లుగా రూపాంతరం చెందాయి. ఇక స్మార్ట్‌ఫోన్ల రాక, తక్కువ ధరకే ఇంటర్నెట్ లభించడంతో డిజిటల్ విప్లవం గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. ఆధార్, జనధన్ ఖాతాల అనుసంధానంతో యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. కోట్లాది మంది పౌరులు రోజువారీ లావాదేవీల కోసం యూపీఐపై ఆధారపడుతూ నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేశారు.
సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సంచలనం
కేవలం సాఫ్ట్‌వేర్ రంగంతో సరిపెట్టుకోకుండా హార్డ్‌వేర్, చిప్ డిజైనింగ్ విభాగాల్లోనూ భారత్ పెద్దపీట వేస్తోంది. లక్షల కోట్ల బడ్జెట్‌తో అమల్లోకి తెచ్చిన సెమీకండక్టర్ మిషన్, నేషనల్ ఏఐ మిషన్ భవిష్యత్తు సాంకేతికతలను శాసించే స్థాయికి మన దేశాన్ని చేరుస్తున్నాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకాల ద్వారా వేలాది మందికి కొత్త ఉపాధి లభించింది. ఇప్పుడు భారతదేశం విదేశీ సాంకేతికతను వాడటమే కాకుండా, నూతన పరిజ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తూ ప్రపంచానికి ఎగుమతి చేసే గ్లోబల్ హబ్‌గా మారుతోంది.
రాట్నం ఆధారంగా మొదలైన స్వదేశీ ప్రయాణం ఇవాళ అంతరిక్ష ఉపగ్రహాలు, సాఫ్ట్‌వేర్, యూపీఐ, చిప్స్ దాకా విస్తరించింది. రాబోయే రోజుల్లో కేవలం డిజిటల్ మార్కెట్‌గా మాత్రమే కాకుండా ప్రపంచానికి అవసరమైన సాంకేతికతను అందించే నూతన శక్తిగా భారత్ నిలవడం ఖాయం.