Oil Imports: మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలో తీవ్ర అలజడి నెలకొంది. ముఖ్యంగా చమురు ఓడలు ప్రయాణించే కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధి దాదాపు మూతపడటంతో గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు వచ్చే ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ సరఫరాకు పెద్ద విఘాతం కలిగింది. ఈ పరిస్థితిని ముందే పసిగట్టిన భారత ప్రభుత్వం తన ఇంధన భద్రతను కాపాడుకునేందుకు అమెరికా వైపు వేగంగా అడుగులు వేసింది. కెప్లర్ డేటా ప్రకారం.. భారత్ తన గ్యాస్ దిగుమతుల కోసం అమెరికాపై ఆధారపడటం పెంచింది.

అమెరికా నుంచి రికార్డు స్థాయిలో LPG, LNG దిగుమతులు

ఆగస్టు నెలలో భారత్ ఒక్క అమెరికా నుంచే దాదాపు 0.62 మిలియన్ టన్నుల ఎల్‌పీజీని దిగుమతి చేసుకుంది. అంతకుముందు జూలైలో 0.89 మిలియన్ టన్నుల ఎల్‌పీజీని కొనుగోలు చేసింది. ఇది భారత్ మొత్తం ఎల్‌పీజీ దిగుమతుల్లో 73 శాతానికి పైగా ఉండటం విశేషం. ఒకప్పుడు భారత్‌కు అతిపెద్ద సరఫరాదారుగా ఉన్న యూఏఈ నుంచి ఆగస్టులో కేవలం 1.40 లక్షల టన్నులు మాత్రమే వచ్చాయి. ఖతార్ నుంచి 60 వేల టన్నులు రాగా, సౌదీ అరేబియా జూలై-ఆగస్టు నెలల్లో అసలు ఎల్‌పీజీ సరఫరానే చేయలేదు. అలాగే ఎల్‌ఎన్‌జీ విషయానికి వస్తే ఖతార్ సరఫరా సున్నాకి చేరడంతో, ఆగస్టులో అమెరికా నుంచి 0.75 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీని భారత్ కొనుగోలు చేసింది.

రష్యా మరియు వెనిజులాలపై తగ్గని నమ్మకం:

గ్యాస్ కోసం అమెరికాను ఆశ్రయించినప్పటికీ.. ముడి చమురు కోసం భారత్ ఇప్పటికీ రష్యా పైనే ఆధారపడుతోంది. పాశ్చాత్య దేశాల ఆంక్షల హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఆగస్టులో భారత్ రష్యా నుంచి రోజుకు దాదాపు 2 మిలియన్ బారెళ్ల క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంది. ఇది యూఏఈ కన్నా మూడు రెట్లు ఎక్కువ. దీంతో పాటు తన సప్లై చైన్‌ను విస్తరించే క్రమంలో దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా నుంచి రోజుకు 3.83 లక్షల బారెళ్ల భారీ రకం క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది.

పెరగనున్న దిగుమతి ఖర్చులు

గల్ఫ్ దేశాలతో పోలిస్తే అమెరికా, వెనిజులాల నుంచి నౌకల్లో ఇంధనాన్ని తీసుకురావడానికి ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. సీనియర్ అనలిస్ట్ సుమిత్ రిటోలియా సమాచారం ప్రకారం.. ప్రయాణ దూరం పెరగడం వల్ల రవాణా ఛార్జీలు (ఫ్రైట్), ఇన్సూరెన్స్ ఖర్చులు భారీగా పెరుగుతాయి. దీనివల్ల భారత దిగుమతి బిల్లుపై అదనపు భారం పడుతుంది. అయితే దేశంలో ఇంధన కొరత ఏర్పడకుండా ఉండేందుకు భారత్ ఎక్కడా తగ్గేదేలే అంటూ ప్రపంచవ్యాప్తంగా విభిన్న దేశాల నుంచి ఇంధనాన్ని తెప్పించుకునే నెట్‌వర్క్‌ను విజయవంతంగా ఏర్పాటు చేసింది.

Tags: