India Ranking : భారత్‌కు చారిత్రక విజయం.. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి సూచికలో టాప్-100లోకి ఎంట్రీ!
ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి సూచికలో టాప్-100లోకి ఎంట్రీ!;
India Ranking : ఇది నిజంగా మనందరికీ గొప్ప శుభవార్త. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి సూచికలో భారతదేశం ఈసారి అదరగొట్టింది. ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్న సమయంలో, దేశాలు తమ అభివృద్ధిని పర్యావరణానికి హాని కలగకుండా ఎలా సాధిస్తున్నాయని ఈ సూచిక ద్వారా తెలుస్తుంది. తాజాగా భారత్ ఈ సూచికలో 99వ స్థానానికి చేరుకుంది. ఇది ఒక పెద్ద మైలురాయిగా చెప్పొచ్చు. ఎందుకంటే టాప్-100 జాబితాలోకి భారత్ రావడం ఇదే మొదటిసారి.
యుఎన్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ సంస్థ తన 10వ ఎస్డీఆర్ నివేదికను విడుదల చేసింది. ఈ 2025 ఎస్డీజీ ఇండెక్స్‌లో భారత్ 67 పాయింట్లతో 99వ స్థానం సంపాదించింది. 167 దేశాల లిస్ట్‌లో ఇది ఒక చెప్పుకోదగ్గ విజయం. అమెరికా, చైనా దేశాలు 75.2, 74.4 పాయింట్లతో వరుసగా 44వ, 49వ స్థానాల్లో ఉన్నాయి. భారత్ పొరుగు దేశాలైన మాల్దీవులు (53), భూటాన్ (74), నేపాల్ (85), శ్రీలంక (93) మనకంటే మెరుగైన ర్యాంకుల్లో ఉన్నాయి. అయితే, బంగ్లాదేశ్ (114), పాకిస్థాన్ (140) సుస్థిర అభివృద్ధి సూచికలో చాలా వెనకబడి ఉన్నాయి.
సుస్థిర అభివృద్ధి అంటే పర్యావరణానికి నష్టం కలిగించకుండా అభివృద్ధి సాధించడం. మానవ జాతి అభివృద్ధి చెందుతూనే, భూమిలోని పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యంతోనే ఐక్యరాజ్యసమితి 2015లో ప్రపంచ దేశాలకు సుస్థిర అభివృద్ధికి కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. ఆ ప్రమాణాల ఆధారంగా, ప్రతి సంవత్సరం దేశాలు ఈ లక్ష్యాలను సాధించడంలో ఎలా పురోగమిస్తున్నాయో పరిశీలించి ర్యాంకులు ఇస్తారు. ప్రతి దేశానికి 100 పాయింట్ల వరకు ఇస్తారు.
భారత్ గతంలో ఈ సూచికలో చాలా వెనకబడి ఉండేది. 2017లో భారత్ 116వ స్థానంలో ఉండేది. అయితే, 2022 నుండి దీని ర్యాంకింగ్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2024లో 109వ స్థానంలో ఉన్న భారత్, 2025లో ఏకంగా 99వ స్థానానికి దూకింది. ప్రభుత్వం తీసుకుంటున్న పర్యావరణ అనుకూల చర్యలు, సుస్థిర అభివృద్ధి పథకాలు ఈ ర్యాంకింగ్ పెరుగుదలకు ప్రధాన కారణాలని చెబుతున్నారు. స్వచ్ఛ భారత్, సోలార్ ఎనర్జీ ప్రోత్సాహం, ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాలు ఈ ర్యాంకును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించాయి.