India-EU Trade Deal: ఇండియా-ఈయూ ట్రేడ్ డీల్..భారీగా తగ్గనున్న విదేశీ కార్ల ధరలు
భారీగా తగ్గనున్న విదేశీ కార్ల ధరలు
India-EU Trade Deal: భారతదేశ ఆటోమొబైల్ రంగంలో పెనుమార్పులు రాబోతున్నాయి. యూరోపియన్ యూనియన్, భారత్ మధ్య జరుగుతున్న స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం చర్చలు దాదాపు ఒక కొలిక్కి వచ్చాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే, విదేశీ కార్ల ప్రేమికులకు పండగే అని చెప్పాలి. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే లగ్జరీ కార్లపై పన్నుల భారాన్ని ప్రభుత్వం భారీగా తగ్గించబోతోంది. దీనివల్ల వోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి ప్రముఖ కంపెనీల కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
యూరోపియన్ యూనియన్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే కార్లపై ప్రస్తుతం విధిస్తున్న 110 శాతం సుంకాన్ని ఏకంగా 40 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంటే దాదాపు 70 శాతం మేర పన్ను భారం తగ్గబోతోంది. ఈ మేరకు మంగళవారం నాడు కీలక ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా 15,000 యూరోల (సుమారు రూ.16.26 లక్షలు) కంటే ఎక్కువ ధర కలిగిన కార్లపై ఈ పన్ను తగ్గింపు వర్తించనుంది. దీంతో యూరోపియన్ కార్ల తయారీ సంస్థలకు భారత మార్కెట్లోకి ప్రవేశించడం చాలా సులభతరం అవుతుంది.
ప్రభుత్వం ఈ 40 శాతం పన్నును కూడా శాశ్వతంగా ఉంచదు. రాబోయే కాలంలో దీనిని అంచెలంచెలుగా 10 శాతానికి తగ్గించే ప్రణాళికలో ఉంది. దీనివల్ల ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి సంస్థల విక్రయాలు మన దేశంలో భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు భారీ పన్నుల కారణంగా ఈ కంపెనీలు తమ కార్ల ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచలేకపోయాయి. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయంతో విదేశీ బ్రాండ్లు కూడా భారత రోడ్లపై ఎక్కువగా కనిపించనున్నాయి.
మరోవైపు స్వదేశీ కార్ల తయారీ సంస్థలైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో మన కంపెనీలు ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టాయి. అందుకే రాబోయే ఐదేళ్ల వరకు ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకం తగ్గింపు ఉండదు. ఐదేళ్ల తర్వాతే ఈవీలపై కూడా పన్ను తగ్గింపును అమలు చేస్తారు. దీనివల్ల స్వదేశీ కంపెనీలు తమ వ్యాపారాన్ని మరింత స్థిరపరుచుకోవడానికి తగిన సమయం లభిస్తుంది. ఈ చారిత్రాత్మక ఒప్పందంతో భారత వాహన రంగం కొత్త పుంతలు తొక్కబోతోంది.