E Visa: భారతదేశానికి వచ్చే విదేశీ ప్రయాణికులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు, వైద్య చికిత్స కోసం వచ్చే రోగుల సౌకర్యార్థం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-వీసా నెట్‌వర్క్ పరిధిని మరింత విస్తరిస్తూ కొత్తగా 11 ఎంట్రీ పాయింట్లను (ఇమ్మిగ్రేషన్ సెంటర్లను) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నూతన నిర్ణయంతో దేశవ్యాప్తంగా అంతర్జాతీయ ఈ-వీసా ప్రయాణికులకు అందుబాటులో ఉన్న మొత్తం పోర్టుల సంఖ్య 88కి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల పర్యాటకరంగం పుంజుకోవడమే కాకుండా అంతర్జాతీయ వ్యాపారాలు, విద్యా సంబంధిత ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి.

నూతనంగా చేరిన విమానాశ్రయాలు, ల్యాండ్ పోర్టులు

ప్రభుత్వం విడుదల చేసిన నూతన జాబితాలో 9 సరిహద్దు భూభాగ చెక్‌పోస్టులు (ల్యాండ్ పోర్టులు), 2 విమానాశ్రయాలు ఉన్నాయి.

* విమానాశ్రయాలు: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి ఎయిర్‌పోర్ట్, మధ్యప్రదేశ్‌లోని భోపాల్ విమానాశ్రయం ఈ నెట్‌వర్క్‌లో చేరాయి.

* భూభాగ చెక్‌పోస్టులు: భారత్-పాకిస్తాన్ సరిహద్దులోని అటారీతో పాటు గేదే, ఘోజాడంగా, హరిదాస్‌పూర్, జైగావ్, దౌకీ, మోరే, దర్రంగా వంటి వ్యూహాత్మక ప్రాంతాలలోని ల్యాండ్ పోర్టులకు అనుమతి లభించింది.

ఈ విస్తరణ తర్వాత దేశంలో మొత్తం 37 విమానాశ్రయాలు, 38 సముద్ర రేవులు (ఓడరేవులు), 13 ల్యాండ్ చెక్‌పోస్టుల ద్వారా విదేశీయులు ఈ-వీసాతో భారత్‌లోకి ప్రవేశించవచ్చు.

డిజిటల్ విప్లవంతో వేగవంతమైన సేవలు

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం భారత్ జారీ చేస్తున్న మొత్తం వీసాలలో ఏకంగా 78 శాతం ఈ-వీసాలే కావడం విశేషం. ఈ-వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ వేగం గణనీయంగా పెరిగింది. దాదాపు 95 శాతం దరఖాస్తులకు కేవలం 72 గంటల్లోనే (3 రోజులు) ఆమోదం లభిస్తోంది. నిజమైన ప్రయాణికులకు ఎలాంటి కాగితపు విధానాల ఇబ్బందులు లేకుండా అత్యంత వేగంగా సేవలు అందించడమే తమ ప్రాథమిక లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

2014 నుంచి విస్తరిస్తున్న సేవలు

2014వ సంవత్సరంలో మొదటగా కేవలం 43 దేశాల పౌరుల కోసం ప్రారంభించిన ఈ-వీసా సౌకర్యం, ప్రస్తుతం 172 దేశాలకు విస్తరించింది. టూరిస్ట్, బిజినెస్, మెడికల్, స్టూడెంట్, కాన్ఫరెన్స్ వంటి మొత్తం 17 విభిన్న కేటగిరీలలో భారత్ ఈ-వీసాలను మంజూరు చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నాయకత్వంలో వీసా నిబంధనలను నిరంతరం సరళతరం చేస్తూ అంతర్జాతీయంగా భారత్ ఇమేజ్‌ను పెంచుతున్నారు.

Tags: