Food Safety: కుటుంబంతో కలిసి ఏసీ రెస్టారెంట్లకు వెళ్లి ప్రశాంతంగా ఆహారం ఆస్వాదించాలనుకునే వారికి ఒక చేదు నిజం ఎదురైంది. అద్భుతమైన లైటింగ్, సువాసనలు చల్లే ఏసీ గదుల వెనుక ఉన్న వంటగదుల్లో భయంకరమైన అపరిశుభ్రత రాజ్యమేలుతోందని లోకల్ సర్కిల్స్ జరిపిన జాతీయ స్థాయి సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా 244 జిల్లాలకు చెందిన 91,000 మందికి పైగా వినియోగదారుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ అధ్యయనంలో 64 శాతం మంది పురుషులు, 36 శాతం మంది మహిళలు పాల్గొన్నారు.

సర్వేలో బయటపడ్డ దిగ్భ్రాంతికర నిజాలు

* సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మంది కస్టమర్లలో 9 మంది గత 12 నెలల్లో కనీసం ఒక్కసారైనా రెస్టారెంట్లలో పరిశుభ్రతా లోపాలను నేరుగా చూశామని చెప్పారు.

* కలుషిత వాతావరణం: 57 శాతం మంది డైనింగ్ ఏరియా, కిచెన్ లేదా వాష్‌రూమ్‌లలో తీవ్రమైన నిల్వ మురికిని చూశామని తెలిపారు.

* బొద్దింకలు, ఎలుకల సంచారం: 45 శాతం మంది వంటగదుల్లో, రెస్టారెంట్ లోపల ఎలుకలు, బొద్దింకలు, ఈగలు తిరుగుతుండటం గమనించారు.

* నూనె మళ్లీ మళ్లీ వాడకం: 53 శాతం మంది ఒకసారి వాడిన వంటనూనెనే మళ్లీ మళ్లీ వేడి చేసి ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

* హానికర ప్లాస్టిక్ వాడకం: 50 శాతం మంది నాణ్యత లేని, మైక్రోవేవ్ సేఫ్ కాని ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్నారని పేర్కొన్నారు.

* శాకాహారం-మాంసాహారం మిక్సింగ్: 45 శాతం మంది వెజ్, నాన్-వెజ్ వంటకాలను వేర్వేరుగా ఉంచే నియమాలను అసలు పాటించడం లేదని వెల్లడించారు.

ఎఫ్‌డిఏ దాడుల్లో సంచలన విషయాలు

ఈ సర్వే ఫలితాలు వెలువడటానికి ముందే మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ప్రముఖ, విలాసవంతమైన క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, విల్లింగ్‌డన్ స్పోర్ట్స్ క్లబ్ వంటి పెద్ద పెద్ద క్లబ్‌లు, రెస్టారెంట్ల ఫుడ్ సేఫ్టీ లైసెన్సులను రద్దు చేశారు. ఆ తనిఖీల్లో కుళ్ళిపోయిన కూరగాయలు, మెట్రిక్ టన్నుల కొద్దీ చెత్త, జామ్ అయిన డ్రైనేజీలు, ఈగలు, బొద్దింకలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు లభించడం ఈ సర్వే గణాంకాలను నిజం చేస్తోంది.

కఠినమైన చర్యలకై వినియోగదారుల డిమాండ్

ఈ ప్రమాదకర పరిస్థితులపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి రెస్టారెంట్, ఫుడ్ డెలివరీ యాప్‌లలో హైజీన్ రేటింగ్ ను బహిరంగంగా ప్రదర్శించాలని 74 శాతం మంది కోరారు. అలాగే ప్రతి మూడు నెలలకొకసారి అధికారులు తనిఖీలు చేపట్టాలని, పదే పదే నిబంధనలు ఉల్లంఘించే రెస్టారెంట్ల లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని 70 శాతానికి పైగా వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

Tags: