Fuel Crisis : అంధకారంలో శ్రీలంక.. ఆదుకున్న భారత్.. భారీగా పెట్రోల్, డీజిల్ పంపిన మోదీ సర్కార్
భారీగా పెట్రోల్, డీజిల్ పంపిన మోదీ సర్కార్
Fuel Crisis : మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఈ సంక్షోభం ద్వీప దేశం శ్రీలంకను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే, శ్రీలంకపై ఎప్పుడు కష్టం వచ్చినా తనే ముందుంటానని భారత్ మరోసారి నిరూపించుకుంది. ఇంధన కొరతతో అల్లాడుతున్న లంకకు భారత్ తక్షణమే 38,000 మెట్రిక్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను పంపించింది. మార్చి 24న శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశానాయకే, ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన వెంటనే.. లంకా ఐఓసీ ద్వారా 20 వేల మెట్రిక్ టన్నుల డీజిల్, 18 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ లోడ్‌తో ఉన్న నౌక మార్చి 28న కొలంబో తీరానికి చేరుకుంది. ఈ సాయం పట్ల లంక అధ్యక్షుడు మోదీకి, విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీలంకలో ప్రస్తుతం ఇంధన కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కరెంటును, ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి నాలుగు రోజులే పనిదినాలు ప్రకటించింది. దీంతో బస్సు, రైల్వే స్టేషన్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. చాలా ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి. ప్రభుత్వం విద్యుత్ వినియోగాన్ని 25 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వీధి దీపాలను ఆపేశారు. ఏసీలకు బదులు టేబుల్ ఫ్యాన్లు వాడాలని అధికారులకు సూచించారు. చివరికి ఎలక్ట్రిక్ వాహనాలను కూడా పగలే చార్జ్ చేసుకోవాలని, రాత్రిపూట గ్రిడ్ మీద భారం వేయొద్దని విజ్ఞప్తి చేశారు.
శ్రీలంక ఎంపీ నమల్ రాజపక్స భారత్ అనుసరిస్తున్న నేబర్‌హుడ్ ఫస్ట్ విధానాన్ని కొనియాడారు. కష్టకాలంలో భారత్ అనుసరిస్తున్న ఫ్యూయల్ టాక్స్ మోడల్‌ను శ్రీలంక కూడా పాటించాలని ఆయన తన ప్రభుత్వానికి సూచించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలపై పన్నుల భారం తగ్గించి, మార్కెట్‌ను ఎలా స్థిరంగా ఉంచాలో భారత్ నుంచి నేర్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, శ్రీలంక ఇప్పుడు శాశ్వత పరిష్కారం కోసం రష్యా వైపు కూడా చూస్తోంది. సరఫరా తగ్గడంతో అమెరికా కూడా రష్యా చమురు నౌకలపై ఆంక్షలను కొంత సడలించింది. దీనిని అవకాశంగా తీసుకుని రష్యా నుంచి దీర్ఘకాలిక ఇంధన ఒప్పందాల కోసం శ్రీలంక చర్చలు జరుపుతోంది.