India Wealth Inequality : 1,688 మంది దగ్గరే రూ. 166 లక్షల కోట్లు.. సామాన్యుడి బతుకు బేజారు

సామాన్యుడి బతుకు బేజారు

Update: 2026-04-06 09:05 GMT

India Wealth Inequality : భారతదేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలపై ఒక సంచలన నివేదిక బయటకు వచ్చింది. దేశంలోని సంపద అంతా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందన్న చేదు నిజాన్ని ఈ రిపోర్ట్ బట్టబయలు చేసింది. సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ తాజాగా విడుదల చేసిన వెల్త్ ట్రాకర్ ఇండియా 2026 నివేదిక ప్రకారం.. మన దేశంలో కేవలం 1,688 మంది కుబేరుల వద్ద ఉన్న ఆస్తి, దేశ మొత్తం జీడీపీలో దాదాపు 50 శాతానికి సమానం. ఈ అంకెలు చూస్తుంటే సామాన్యుడికి కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. దేశంలో ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతుంటే, పేదలు అక్కడే ఉండిపోతున్నారు. ఈ పరిస్థితిని చూస్తుంటే పాతకాలపు వలసపాలన నాటి ఆర్థిక అసమానతలు గుర్తుకొస్తున్నాయని నివేదిక విశ్లేషించింది. ఏప్రిల్ 1, 2026న ట్యాక్స్ ది టాప్ పేరుతో సాగుతున్న ప్రచారం మధ్య ఈ నివేదికను విడుదల చేశారు. 2019 నుంచి 2025 మధ్య కాలంలో ఎగువ తరగతి వారి ఆస్తులు ఊహించని వేగంతో పెరిగాయని, కానీ దిగువ తరగతి ప్రజల ఆదాయంలో ఎలాంటి మార్పు లేదని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది.

అంకెల్లో అసలు లెక్క ఇదే..

దేశంలోని కేవలం 1 శాతం మంది సంపన్నుల వద్దే 40 శాతానికి పైగా సంపద కేంద్రీకృతమై ఉంది. మరోవైపు, దేశంలోని సగం జనాభా (దిగువన ఉన్న 50 శాతం మంది) కేవలం 15 శాతం ఆదాయంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. 2019లో రూ.1,000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న వారి సంఖ్య ఇప్పుడు 77 శాతం పెరిగింది. వీరి మొత్తం ఆస్తి రూ.31 లక్షల కోట్ల నుంచి ఏకంగా రూ.88 లక్షల కోట్లకు చేరింది. అంటే దాదాపు 227 శాతం పెరుగుదల అన్నమాట.

అంబానీ, అదానీల ఆస్తుల వేగం.. అదిరిపోయే జంప్

దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, సావిత్రీ జిందాల్, సునీల్ మిట్టల్, శివ్ నాడార్ వంటి ఐదుగురు దిగ్గజాల ఆస్తులు 2019-2025 మధ్య కాలంలో 400 శాతం పెరిగాయి. ఒక్క ముకేశ్ అంబానీ ఆస్తి 153 శాతం పెరగగా, గౌతమ్ అదానీ సంపద ఏకంగా 625 శాతం వృద్ధి చెందింది. ఈ ఐదు కుటుంబాల మొత్తం ఆస్తి 2019లో రూ.6.68 లక్షల కోట్లు ఉంటే, 2025 నాటికి అది రూ.26.54 లక్షల కోట్లకు చేరినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

కుబేరులపై ట్యాక్స్ వేస్తే పేదల పంట పండుతుంది

ఈ ఆర్థిక అసమానతలను తగ్గించడానికి నివేదిక ఒక చక్కని మార్గాన్ని సూచించింది. దేశంలోని అత్యంత ధనికులపై ప్రోగ్రెసివ్ వెల్త్ ట్యాక్స్ విధించాలని కోరింది. 1,688 అత్యంత ధనిక కుటుంబాలపై 2 నుంచి 6 శాతం వరకు వెల్త్ ట్యాక్స్, అలాగే వారసత్వ సంపదపై మూడో వంతు పన్ను విధిస్తే.. ప్రభుత్వానికి ఏటా రూ. 10.63 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని CFA లెక్కగట్టింది. ఈ భారీ మొత్తాన్ని విద్య, వైద్యం, సామాజిక సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తే పేదరికాన్ని నిర్మూలించడం సులభమని పేర్కొంది.

Tags:    

Similar News