Indian Airports : ఇక విదేశీ ప్రయాణం మస్త్ ఈజీ.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఎయిర్ పోర్టుల్లో సరికొత్త ఇంటిగ్రేటెడ్ పాలసీ

ఎయిర్ పోర్టుల్లో సరికొత్త ఇంటిగ్రేటెడ్ పాలసీ

Update: 2026-06-22 09:58 GMT

Indian Airports : అంతర్జాతీయ విమానయాన రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఎదగడానికి భారతదేశం శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో దుబాయ్, అబుదాబి, దోహా వంటి ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయాలకు ప్రత్యామ్నాయంగా భారతీయ ఎయిర్‌పోర్టులను నిలపాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది. ఇందులో భాగంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రధాన విమానాశ్రయాలను అంతర్జాతీయ ట్రాన్సిట్ సెంటర్లుగా మార్చడానికి ఒక సరికొత్త సమగ్ర విధానాన్ని రూపొందించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.

దుబాయ్, సింగపూర్ మార్కెట్‌కు గట్టి పోటీ

ప్రస్తుత లెక్కల ప్రకారం.. భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లే కనెక్టింగ్ విమాన ప్రయాణికులలో దాదాపు 85 శాతం మంది దుబాయ్, అబుదాబి, సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయాల గుండానే ప్రయాణిస్తున్నారు. అలాగే ఉత్తర అమెరికాకు వెళ్లే చాలా మంది భారతీయులు ఫ్రాంక్‌ఫర్ట్, లండన్ వంటి యూరోపియన్ విమానాశ్రయాల మీదుగా వెళ్తుంటారు. ఈ భారీ ట్రాఫిక్‌ను, ఆదాయాన్ని భారతదేశానికే తిప్పుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈ కొత్త విధానం ద్వారా మన ఎయిర్‌పోర్టులే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలకు నేరుగా అనుసంధానం కానున్నాయి.

ఇమ్మిగ్రేషన్, కార్గో స్క్రీనింగ్ నిబంధనల సరళీకరణ

భారతదేశాన్ని అంతర్జాతీయ హబ్‌గా మార్చే వ్యూహంలో భాగంగా ప్రభుత్వం ఎయిర్‌పోర్టులలో ఇమ్మిగ్రేషన్, కార్గో స్క్రీనింగ్ నిబంధనలను చాలా సులభతరం చేసింది. దీనివల్ల చిన్న పట్టణాల నుంచి మెట్రో నగరాల మీదుగా విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణం ఎంతో సులువు కానుంది. వచ్చే వారం నుండి ఎయిర్ ఇండియా ఒక సరికొత్త విమాన సర్వీసును ప్రారంభించబోతోంది. దీని ద్వారా వారణాసి నుంచి లండన్ హీథ్రో, ఫ్రాంక్‌ఫర్ట్, మిలాన్, సింగపూర్ వంటి 17 అంతర్జాతీయ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణ ప్రారంభ స్థానమైన వారణాసిలోనే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

మళ్లీ మళ్లీ తనిఖీలు లేని సుఖవంతమైన ప్రయాణం

ఈ సరికొత్త విధానం ప్రకారం.. వారణాసిలో ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికులు ఢిల్లీ లేదా ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాక, అక్కడ మళ్లీ ఎలాంటి ఇమ్మిగ్రేషన్ లేదా కస్టమ్స్ తనిఖీలు లేకుండానే నేరుగా తమ అంతర్జాతీయ ఫ్లైట్ ఎక్కేయవచ్చు. అంతేకాకుండా వారి లగేజీని కూడా ఎయిర్‌సైడ్ (రన్‌వే విభాగం) లోనే అంతర్గతంగా వేరే ఫ్లైట్‌కు బదిలీ చేస్తారు. దీనివల్ల ప్రయాణికులు మధ్యలో లగేజ్ కలెక్ట్ చేసుకుని, మళ్లీ చెక్-ఇన్ చేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. వారణాసి-ఢిల్లీ రూట్‌లో ఈ హబ్-అండ్-స్పోక్ మోడల్‌ను విజయవంతంగా పరీక్షించిన తర్వాత, దేశంలోని మరిన్ని నగరాలను ఈ హబ్ పరిధిలోకి తీసుకువస్తారు.

కనెక్టింగ్ టైమ్‌ను తగ్గించే ఎయిర్‌సైడ్ బస్సులు

ఒక విమానాశ్రయం విజయవంతమైన గ్లోబల్ ట్రాన్సిట్ హబ్‌గా మారాలంటే.. ప్రయాణికులు ఒక ఫ్లైట్ దిగి మరో ఫ్లైట్ ఎక్కడానికి మధ్య ఉండే సమయం చాలా తక్కువగా ఉండాలి. దుబాయ్, ఇస్తాంబుల్ వంటి అంతర్జాతీయ విమానాశ్రయాలలో హై-స్పీడ్ ట్రెయిన్లు లేదా అండర్ గ్రౌండ్ రోడ్ నెట్‌వర్క్ ఉండటం వల్ల టెర్మినల్స్ మధ్య కనెక్షన్ టైమ్ కేవలం 60 నిమిషాలు మాత్రమే పడుతుంది. కానీ మన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టెర్మినల్స్ మధ్య దూరం ఎక్కువగా ఉండటం వల్ల ప్రస్తుతం దీనికి రెండు గంటల సమయం పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ త్వరలోనే మూడు టెర్మినల్స్ మధ్య ఎయిర్‌సైడ్ బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. దీనివల్ల ప్రయాణీకుల బదిలీ సమయం కేవలం 20 నిమిషాలకు తగ్గిపోతుంది.

భారతదేశంలోనే మొట్టమొదటి ఎయిర్ ట్రెయిన్ ప్లాన్

ఈ ప్రయాణ అనుభవాన్ని మరింత ఆధునీకరించడానికి ఢిల్లీ విమానాశ్రయంలో భారతదేశపు మొట్టమొదటి ఎయిర్ ట్రెయిన్ ప్రాజెక్టును ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రత్యేక రైలు ఎయిర్‌పోర్టులోని మూడు టెర్మినల్స్‌తో పాటు కార్గో విభాగాన్ని కూడా అనుసంధానిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రాబోయే 30 నెలల్లో పూర్తి కానుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణించే ప్రతి నలుగురిలో ఒకరు కనెక్టింగ్ (ట్రాన్స్ఫర్) ప్రయాణికుడే ఉంటుండటం గమనార్హం. ఈ కొత్త ఫెసిలిటీస్ అందుబాటులోకి వస్తే గ్లోబల్ ఏవియేషన్ మ్యాప్‌లో భారతీయ విమానాశ్రయాల హవా నడవటం ఖాయం.

Tags:    

Similar News