Indian Coffee Exports : కర్ణాటక కాఫీకి ప్రపంచమే ఫిదా..ఇటలీ, జర్మనీలు మన రుచికి బానిసవ్వాల్సిందే
ఇటలీ, జర్మనీలు మన రుచికి బానిసవ్వాల్సిందే
Indian Coffee Exports : ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రియుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా భారత్ నుంచి ఎగుమతి అయ్యే కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2025 సంవత్సరంలో భారత కాఫీ ఎగుమతులు ఏకంగా 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.16,600 కోట్లు) మైలురాయిని చేరుకోవడం విశేషం. ఈ అద్భుతమైన విజయంలో మన పొరుగు రాష్ట్రం కర్ణాటక కింగ్ లా నిలిచింది. యూరప్ దేశాల ప్రజలు మన దక్షిణ భారత కాఫీ రుచికి ఫిదా అయిపోతున్నారు.
భారతదేశపు కాఫీ ఎగుమతులు 2025లో సరికొత్త చరిత్ర సృష్టించాయి. గతంలో 1.28 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతి విలువ, ఏడాది తిరగకముందే 2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా కాఫీని ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ ఏడవ స్థానంలో ఉంది. 2024-25లో 3.6 లక్షల టన్నుల కాఫీ ఉత్పత్తి కాగా, వచ్చే ఏడాది ఇది 4 లక్షల టన్నులు దాటుతుందని అంచనా. మన దేశంలో పండే కాఫీలో దాదాపు 70 శాతం విదేశాలకే ఎగుమతి అవుతుండటం గమనార్హం.
భారతదేశ మొత్తం కాఫీ ఉత్పత్తిలో కర్ణాటక వాటా ఏకంగా 70 శాతానికి పైగా ఉంది. అందుకే కాఫీ పరిశ్రమలో కర్ణాటకను మహారాజుగా పిలుస్తారు. మన దేశంలో ప్రధానంగా అరేబికా, రోబస్టా అనే రెండు రకాల కాఫీలను పండిస్తారు. అరేబికా రకం కాఫీని ఎక్కువగా కర్ణాటకలోని కొడగు, చిక్కమగళూరు జిల్లాల్లో పండిస్తారు. దీనికి పశ్చిమ ఆసియా దేశాల్లో మంచి మార్కెట్ ఉంది. కేరళలో కూడా అరేబికా రకాన్నే ఎక్కువగా సాగు చేస్తారు.
రోబస్టా రకం కాఫీ కాస్త ఘాటుగా, చేదుగా ఉంటుంది. కానీ ఈ రుచిని ఇటలీ, జర్మనీ వంటి యూరోపియన్ దేశాల ప్రజలు అమితంగా ఇష్టపడతారు. కర్ణాటకలో పండే రోబస్టా కాఫీకి ఇటలీ అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. భారత్ ప్రస్తుతం 50 కంటే ఎక్కువ దేశాలకు కాఫీని ఎగుమతి చేస్తోంది. ఇందులో రష్యా, యూఏఈ, బెల్జియం, అమెరికా, జపాన్ దేశాలు కూడా భారత కాఫీని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి.
దేశంలోని మొత్తం కాఫీ ఉత్పత్తిలో 95 శాతం కేవలం దక్షిణ భారత రాష్ట్రాలైన కర్ణాటక (70%), కేరళ (20%), తమిళనాడు (5%) నుంచే వస్తోంది. కొద్దిపాటి మొత్తంలో ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కాఫీ సాగు జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కాఫీ ఎగుమతులు ఏటా 15 శాతం వృద్ధి రేటుతో పెరుగుతున్నాయి. ఇదే వేగం కొనసాగితే భవిష్యత్తులో ప్రపంచ కాఫీ మార్కెట్‌ను భారత్ శాసించే స్థాయికి చేరుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.