Indian Railways : చీమ చిటుక్కుమన్నా తెలిసేలా రైల్వే ట్రాకులు.. గంటకు 180 కి.మీ వేగంతో దూసుకెళ్లనున్న రైళ్లు
గంటకు 180 కి.మీ వేగంతో దూసుకెళ్లనున్న రైళ్లు
Indian Railways : భారతీయ రైల్వే ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. రాబోయే కొన్నేళ్లలో బుల్లెట్ రైలుకు స్వాగతం పలికేందుకు దేశం సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రస్తుతం ఉన్న ట్రాక్‌లపైనే రైళ్ల వేగాన్ని పెంచేందుకు రైల్వే శాఖ శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రయాణ సమయాన్ని తగ్గించి, సామాన్యులకు హైస్పీడ్ ప్రయాణాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా రైల్వే కొత్త ప్రయోగాలు చేస్తోంది. తాజాగా దేశంలోని కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో రైళ్లను ఏకంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.
180 కి.మీ వేగంతో స్పీడ్ ట్రయల్స్
ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌లో ఒక అద్భుతమైన ఘనత నమోదైంది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ నుంచి ప్రధాన్‌ఖాంఠా మధ్య ఒక ప్రత్యేక రైలుతో స్పీడ్ ట్రయల్ నిర్వహించారు. ఈ మార్గంలో రైలు ఏకంగా గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించింది. సుమారు 110 నుంచి 120 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గాన్ని సాధారణంగా రైళ్లు ఒకటిన్నర నుంచి రెండున్నర గంటల్లో పూర్తి చేస్తాయి. కానీ ఈ వేగంతో ప్రయాణించడం వల్ల ప్రయాణ సమయం దాదాపు 45 నిమిషాల వరకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
రాజస్థాన్‌లోనూ అదిరిపోయే వేగం
కేవలం ఈ ఒక్క రూట్లోనే కాదు, రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ - కోటా సెక్షన్‌లో కూడా 125 కిలోమీటర్ల మేర 180 కి.మీ వేగంతో ట్రయల్స్ పూర్తి చేశారు. ఇక్కడ కూడా 30 నుంచి 45 నిమిషాల సమయం ఆదా అవుతుందని అంచనా. అలాగే, ఢిల్లీ-ఆగ్రా సెక్షన్‌లో కూడా 150 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ట్రాక్ వెంబడి ఫెన్సింగ్ (కంచె) వేసే పనులను రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది.
ఫెన్సింగ్.. రక్షణకే కాదు, వేగం కోసం కూడా
సాధారణంగా రైల్వే ట్రాక్ పక్కన కంచె వేయడం అంటే ఆక్రమణలను అడ్డుకోవడానికే అని చాలామంది అనుకుంటారు. కానీ, ఇప్పుడు రైల్వే చేస్తున్న ఫెన్సింగ్ ప్రధాన ఉద్దేశ్యం వేగం. గంటకు 110 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో రైళ్లు వెళ్లేటప్పుడు ట్రాక్‌పైకి జంతువులు, వాహనాలు రాకుండా ఉంటేనే ప్రమాదాలు జరగవు. అందుకే ట్రాక్ పక్కన పటిష్టమైన కంచెను ఏర్పాటు చేస్తున్నారు. వేగాన్ని పెంచిన మూడేళ్లలోపు ఈ ఫెన్సింగ్ పనులన్నీ పూర్తి చేయాలని అన్ని రైల్వే జోన్లకు ఆదేశాలు అందాయి.
ప్రయాణికుల భద్రతే ముఖ్యం
రైల్వే ట్రాక్‌లు చాలా చోట్ల గ్రామాల మధ్య నుంచి వెళ్తుంటాయి. మనుషులు, మందలు ట్రాక్ దాటడం వల్ల ప్రమాదాలు జరిగి రైళ్ల వేగం తగ్గిపోతోంది. హైస్పీడ్ రైళ్లు ప్రయాణించేటప్పుడు ఇలాంటి అవరోధాలు ఉంటే రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంది. అందుకే, రైళ్లను సురక్షితంగా, వేగంగా నడిపేందుకు ఫెన్సింగ్ అనివార్యమని రైల్వే శాఖ భావిస్తోంది. త్వరలోనే ఈ మార్గాల్లో వందే భారత్ వంటి ఆధునిక రైళ్లు 180 కి.మీ వేగంతో దూసుకెళ్లడం మనం చూడవచ్చు.