Rupee vs Dollar: అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో నిరంతరం పోరాడుతున్న భారత రూపాయి శుక్రవారం అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఒకే రోజులో 43 పైసలు ఎగబాకి డాలర్‌తో పోలిస్తే 93.98 వద్ద స్థిరపడింది. గత ఏడు ట్రేడింగ్ రోజులను పరిశీలిస్తే రూపాయి విలువ ఏకంగా 1.31 శాతం మేర పుంజుకోవడం విశేషం. ఏప్రిల్ 22 తర్వాత అంటే దాదాపు 200 రోజుల సుదీర్ఘ విరామం అనంతరం రూపాయి మళ్లీ 94 స్థాయి కంటే దిగువకు వచ్చి 93 వద్ద బలమైన స్థానంలో నిలిచింది.

రూపాయికి కలిసివచ్చిన అంశాలు

ఈ బలమైన పురోగతి వెనుక అనేక ప్రధాన అంతర్జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి. ఆసియా మార్కెట్లలో డాలర్ బలహీనపడటం, క్రూడ్ ఆయిల్ ధరలు దిగిరావడం రూపాయికి బాగా కలిసివచ్చాయి. అమెరికాలో జరిగిన మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్నకు ఎదురుదెబ్బ తగలడం వల్ల అంతర్జాతీయంగా డాలర్ సూచీలో క్షీణత కనిపించింది. దీనికితోడు విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ భారతీయ షేర్లలో పెట్టుబడులు పెట్టడం, దిగుమతి ఖర్చులు తగ్గడంతో రూపాయి మరింత బలపడటానికి బాటలు పరిచింది.

మార్కెట్ లోపల అసలేం జరిగింది?

ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి 94.50 వద్ద మొదలైంది. ఒకానొక సమయంలో ఇంట్రా డేలో 93.82 అత్యున్నత స్థాయిని, 94.50 కనిష్ఠ స్థాయిని తాకింది. చివరికి 93.98 వద్ద క్లోజ్ అయింది. మన దేశీయ స్టాక్ మార్కెట్లలో కూడా భారీ బుల్ రన్ కనిపించింది. గురువారం ముగింపుతో పోలిస్తే శుక్రవారం సెన్సెక్స్ 1,718 పాయింట్లు, నిఫ్టీ 493 పాయింట్లు లాభపడ్డాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఒక్కరోజే రూ.13,749 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం రూపాయికి కొండంత అండగా నిలిచింది.

గత వారం రోజుల లెక్కలు ఇవే

అక్టోబర్ 28న డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.23 వద్ద అత్యంత కనిష్ఠంలో ఉండేది. అక్కడి నుంచి ఎనిమిది రోజుల వ్యవధిలోనే 1.31 శాతం పుంజుకుని 93.98కి రావడం చాలా పెద్ద విజయంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బారెల్‌కు 100.30 డాలర్లకు పెరిగినప్పటికీ, మన దేశీయ మార్కెట్లలో కనిపించిన సానుకూల వాతావరణం రూపాయి ఒత్తిడికి లోనుకాకుండా కాపాడింది.

మున్ముందు ఎలా ఉండబోతుంది ?

రాబోయే రోజుల్లో రూపాయి మరింత స్థిరంగా ముందుకు సాగుతుందని కరెన్సీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి స్పాట్ రేటు 93.65 నుంచి 94.20 పరిధిలో ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా బాండ్ యీల్డ్స్ తగ్గడం మన రూపాయికి మరింత మేలు చేయనుంది. అయితే రష్యా-ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రూపాయి పెరుగుదలకు కొంత అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే రూపాయి త్వరలోనే 90 స్థాయికి చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని భావిస్తున్నారు.

Tags: