Firework Industry: దసరా, దపావళి వచ్చిందంటే చాలు దేశమంతా పటాకుల శబ్దాలతో హోరెత్తిపోతుంది. మన దేశంలో బాణసంచా అమ్మకాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కస్టమర్ల డిమాండ్‌కు తగ్గట్టుగా దేశీయంగా వేల కోట్ల విలువైన బాణసంచా ఉత్పత్తి జరుగుతోంది. పరిశ్రమ వర్గాల లెక్కల ప్రకారం మన దేశంలో పటాకుల మార్కెట్ విలువ దాదాపు 7,000 కోట్ల రూపాయలు దాటుతుంది. ఉత్పత్తిలో అపారమైన అనుభవం, ప్రతిభ ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ఎగుమతి మార్కెట్‌కు వచ్చేసరికి మన దేశం తీవ్రంగా వెనుకబడిపోతోంది.

గ్లోబల్ మార్కెట్‌లో చైనా హవా

ప్రపంచ బాణసంచా ఎగుమతి మార్కెట్‌లో పొరుగు దేశమైన చైనా తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. చైనా ప్రతి ఏటా దాదాపు 1.1 బిలియన్ డాలర్ల నుంచి 1.23 బిలియన్ డాలర్ల విలువైన పటాకులను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఆ దేశంలోని లియుయాంగ్ నగరం ఒక్కటే ప్రపంచ ఎగుమతుల్లో 70 శాతం బాణసంచాను సరఫరా చేస్తూ గ్లోబల్ హబ్‌గా మారింది. దానికి పూర్తి భిన్నంగా భారత ఎగుమతుల విలువ ఏడాదికి కనీసం 10 లక్షల డాలర్లు కూడా ఉండటం లేదు. అంటే అంతర్జాతీయ మార్కెట్‌లో మన దేశ వాటా కేవలం 0.042 శాతం మాత్రమే.

తమిళనాడు శివకాశి దేశీయ అవసరాలకే సరిపోతుందా?

మన దేశంలో తయారయ్యే బాణసంచాలో సింహభాగం తమిళనాడులోని శివకాశి నుంచే వస్తుంది. దేశమంతటా అమ్ముడయ్యే పటాకుల్లో దాదాపు 85 నుంచి 90 శాతం ఇక్కడే తయారవుతాయి. ఈ రంగానికి వచ్చే రాబడిలో 80 శాతానికి పైగా కేవలం దీపావళి ముందు వచ్చే 30 రోజుల్లోనే నమోదు కావడం గమనార్హం. ఇవి కాకుండా కేరళలో విషు, మహారాష్ట్రలో గణేష్ చతుర్థి వంటి పండుగల సమయాల్లోనూ శివకాశి బాణసంచాకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈ ఉత్పత్తి అంతా కేవలం దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడానికే సరిపోతోంది తప్ప, ఎగుమతుల స్థాయికి చేరడం లేదు.

ఎగుమతులకు అడుగడుగునా ఆటంకాలు

విదేశాలకు పటాకులను పంపడంలో భారతీయ వ్యాపారులు అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పటాకులను అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాల జాబితాలో చేర్చడం వల్ల రవాణా, ప్యాకేజింగ్, ఇన్సూరెన్స్, పోర్టులలో హ్యాండ్లింగ్ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. దీనికితోడు 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం బేరియం నైట్రేట్ అనే రసాయనం వినియోగంపై ఆంక్షలు విధించారు. విదేశీ మార్కెట్లలో ప్రాచుర్యం పొందిన కొన్ని రకాల బాణసంచా తయారీకి ఈ రసాయనం చాలా అవసరం. కానీ మన దేశంలో వీటి వినియోగంపై ఉన్న ఆంక్షల వల్ల అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉత్పత్తులను సృష్టించడం తయారీదారులకు సాధ్యపడటం లేదు.

శివకాశి గ్లోబల్ హబ్‌గా మారాలంటే ఏం చేయాలి?

అంతర్జాతీయ స్థాయిలో చైనాతో పోటీపడాలంటే మన దేశ బాణసంచా పరిశ్రమలో ఆధునిక సాంకేతికతను తీసుకురావడం తక్షణ అవసరం. శివకాశి ప్రాంతంలో ప్రపంచ స్థాయి నాణ్యతను పరీక్షించే సెంటర్లు, అధునాతన ప్యాకేజింగ్ యూనిట్లు స్థాపించాలి. కఠినమైన అనుమతుల ప్రక్రియను సరళతరం చేస్తూ, చిన్న తరహా తయారీదారులను విదేశీ కొనుగోలుదారులతో నేరుగా అనుసంధానించే వేదికలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందించి, భద్రతా ప్రమాణాలను పెంచితే శివకాశి కూడా గ్లోబల్ మార్కెట్‌లో చైనాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

Tags: