IPO Tsunami : భారత మార్కెట్‌లో ఐపీఓల సునామీ.. డిసెంబర్-జనవరిలో 24 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు

డిసెంబర్-జనవరిలో 24 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు

Update: 2025-12-01 06:27 GMT

IPO Tsunami : భారతీయ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల సునామీ రాబోతోంది. ఈ సంవత్సరం చివరి నెల (డిసెంబర్), కొత్త సంవత్సరం మొదటి నెల (జనవరి)లో దాదాపు రెండు డజన్లకు పైగా కంపెనీలు తమ ఐపీఓలను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు నెలల్లో సుమారు రూ.40,000 కోట్లకు పైగా నిధులు మార్కెట్‌లోకి రానున్నాయి. మెర్చంట్ బ్యాంకర్ల అంచనా ప్రకారం.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ, మీషో, జునిపర్ గ్రీన్ ఎనర్జీ వంటి ప్రముఖ కంపెనీలతో సహా మొత్తం 24 కంపెనీలు తమ పబ్లిక్ ఇష్యూలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ పరిణామం కేవలం కంపెనీల ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే కాదు, దీర్ఘకాలిక పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న నమ్మకాన్ని కూడా సూచిస్తుంది.

రాబోయే రెండు నెలల్లో పబ్లిక్ ఇష్యూలు తీసుకురానున్న కంపెనీల జాబితా చాలా బలంగా ఉంది. ఈ ఐపీఓ పైప్‌లైన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన ఫ్రాక్టల్ అనలిటిక్స్, హోమ్, స్లీప్ సొల్యూషన్స్ బ్రాండ్ వేక్‌ఫిట్ ఇన్నోవేషన్స్, టెక్నాలజీ ఆధారిత భద్రత, నిఘా సంస్థ ఇన్నోవేటివ్‌వ్యూ ఇండియా, అలాగే హాస్పిటల్స్ చైన్ పార్క్ మెడి వరల్డ్ వంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి.

ఈ ఐపీఓల ద్వారా దాదాపు రూ. 40,000 కోట్లకు పైగా నిధులు సమీకరిస్తారని అంచనా. ఈ నిధులను కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలు, మూలధన వ్యయం, రుణ చెల్లింపు, సాధారణ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తాయి. రాబోయే వారాల్లో పెద్ద, మధ్యస్థ, చిన్న స్థాయి కంపెనీలు ఐపీఓలను తీసుకురావడానికి సిద్ధమవుతుండటం, కంపెనీలకు పెట్టుబడిదారులకు మార్కెట్‌పై ఉన్న బలమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.

భారతీయ ప్రైమరీ మార్కెట్ గత కొంతకాలంగా చురుకుగా ఉంది. 2025 సంవత్సరంలో ఇప్పటివరకు 96 కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. ఈ కంపెనీలు ఐపీఓల ద్వారా ఏకంగా రూ. 1.6 లక్షల కోట్లు సమీకరించాయి. కేవలం గత మూడు నెలల్లోనే 40కి పైగా కంపెనీలు లిస్ట్ అయ్యాయి, ఇది ప్రాథమిక మార్కెట్‌లో పెరుగుతున్న కార్యకలాపాలను తెలియజేస్తుంది. గత సంవత్సరం (2024)లో 91 పబ్లిక్ ఇష్యూల ద్వారా మొత్తం రూ. 1.6 లక్షల కోట్లు మాత్రమే సమీకరించబడ్డాయి. ఈ ఏడాది రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం, ప్రైవేట్ పెట్టుబడులు, వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా ఈ రంగం మరింత బలం పుంజుకుంది.

ఈ ఐపీఓల ప్రవాహంతో భారతీయ ప్రైమరీ మార్కెట్ ఒక కొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉంది. ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ నిపుణులు థామస్ స్టీఫెన్ అభిప్రాయం ప్రకారం.. డిసెంబర్‌లో రాబోయే అనేక ఐపీఓల కారణంగా, 2025లో పబ్లిక్ ఇష్యూల ద్వారా సమీకరించిన మొత్తం రూ.2లక్షల కోట్ల మార్కును చేరుకునే అవకాశం ఉంది. ఇది భారతీయ ప్రైమరీ మార్కెట్‌లో ఒక కొత్త రికార్డు అవుతుంది. మేవెనార్క్ కో-ఫౌండర్, సీఈఓ శంతను అవస్థి మాట్లాడుతూ.. గతంలో పబ్లిక్ ఇష్యూలు తీసుకురావడానికి వెనుకాడిన కంపెనీలు కూడా, ఇప్పుడు నిరంతర వృద్ధికి భారీ మూలధనం అవసరమని గుర్తించి ఐపీఓల మార్గాన్ని ఎంచుకుంటున్నాయి అని తెలిపారు.

Tags:    

Similar News