Kitchen Appliance : ఇండక్షన్ స్టౌలకు ఫుల్ డిమాండ్..ఆన్‌లైన్ లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కుక్కర్లు

ఆన్‌లైన్ లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కుక్కర్లు

Update: 2026-03-13 06:57 GMT

Kitchen Appliance : దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత వార్తలు వస్తుండటంతో సామాన్యులే కాదు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు కూడా రూటు మార్చారు. వంట గ్యాస్ సరఫరాలో అంతరాయం కలిగితే ప్రజలందరూ ఎలక్ట్రిక్ వంట పరికరాల వైపు మొగ్గు చూపుతారనే అంచనాలతో కిచెన్ అప్లయన్స్ కంపెనీల షేర్లు గురువారం రాకెట్లా దూసుకెళ్లాయి. మార్కెట్ ప్రారంభం కావడమే ఈ రంగంలోని కంపెనీల షేర్లు భారీ లాభాలతో మొదలయ్యాయి. గ్యాస్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఇండక్షన్ స్టౌలు, ఎలక్ట్రిక్ కుక్కర్ల అమ్మకాలు పెరుగుతాయని ఇన్వెస్టర్లు నమ్ముతున్నారు.

ముఖ్యంగా జైపన్ ఇండస్ట్రీస్ షేర్లు ఏకంగా 14.35 శాతం ఎగబాకగా, ప్రముఖ సంస్థ టీటీకే ప్రెస్టీజ్ షేర్లు 9.81 శాతం లాభపడ్డాయి. బటర్‌ఫ్లై గాంధీమతి షేర్లు కూడా ప్రారంభంలో 5 శాతం పెరిగినప్పటికీ, చివరకు స్వల్ప నష్టంతో ముగిశాయి. బజాజ్ ఎలక్ట్రికల్స్, ఈప్యాక్ డ్యూరబుల్ వంటి కంపెనీలు కూడా గ్రీన్ సిగ్నల్‌లోనే ఉన్నాయి. గ్యాస్ సరఫరాపై నెలకొన్న అనిశ్చితి ఈ కంపెనీల పాలిట వరంగా మారిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక క్షేత్రస్థాయిలో చూస్తే, సిలిండర్ల కోసం వేచి చూడటం కంటే ఎలక్ట్రిక్ వస్తువులే మేలని ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. దీంతో ఇండక్షన్ కుక్‌టాప్‌లు, రైస్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ ప్రెజర్ కుక్కర్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఎంతలా అంటే, కొన్ని క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో (Blinkit, Zepto వంటివి) ఇండక్షన్ స్టౌలు సోల్డ్ అవుట్ అని బోర్డులు కనిపిస్తున్నాయి. గ్యాస్ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో తెలియని తరుణంలో, ముందు జాగ్రత్తగా జనం వీటిని ఎగబడి కొంటున్నారు.

ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో కూడా ఈ సందడి స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో గత 45 రోజుల్లో ఇండక్షన్ స్టౌల అమ్మకాలు సాధారణం కంటే నాలుగు రెట్లు పెరిగాయి. ముఖ్యంగా ఢిల్లీ, కోల్‌కతా, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో వీటికి భారీ డిమాండ్ ఉంది. ఇక అమెజాన్‌లో అయితే ఇండక్షన్ కుక్‌టాప్‌ల అమ్మకాలు ఏకంగా 30 రెట్లు పెరగడం విశేషం. కేవలం స్టౌలే కాకుండా రైస్ కుక్కర్లు, ఎయిర్ ఫ్రైయర్లు, మల్టీ యూజ్ కెటిల్స్ అమ్మకాలు కూడా గతంతో పోలిస్తే రెండు మూడు రెట్లు అధికమయ్యాయి. వంట గ్యాస్ సంక్షోభం కిచెన్ అప్లయన్స్ మార్కెట్‌లో కొత్త ఊపును తీసుకువచ్చింది.

Tags:    

Similar News