Chemical Industry : భారత కెమికల్ రంగంలో పెను సంచలనం.. 2030 నాటికి 255 బిలియన్ డాలర్ల మార్కెట్

2030 నాటికి 255 బిలియన్ డాలర్ల మార్కెట్

Update: 2026-03-18 07:01 GMT

Chemical Industry : భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కెమికల్ ఇండస్ట్రీ ఒక కీలకమైన మలుపు వద్ద నిలబడింది. రాబోయే ఐదేళ్లలో ఈ రంగం ఊహించని రీతిలో అభివృద్ధి చెందబోతోందని ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టెన్సీ సంస్థ మ్యాకిన్సే అండ్ కంపెనీ తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం సుమారు 155-165 బిలియన్ డాలర్ల పరిమాణంలో ఉన్న ఈ పరిశ్రమ, 2030 నాటికి ఏకంగా 230-255 బిలియన్ డాలర్ల (సుమారు రూ.21 లక్షల కోట్లు) స్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. ఈ వృద్ధి రేటు మన దేశ జీడీపీ వృద్ధి కంటే కూడా వేగంగా ఉండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, భారత్ మాత్రం ఏడాదికి 8-9 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేయబోతోంది.

ఈ భారీ వృద్ధికి ముఖ్యంగా ఎనిమిది కొత్త రంగాలు ఊతమివ్వబోతున్నాయి. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, పునరుత్పాదక ఇంధనం, నిర్మాణ రంగం, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటో పార్ట్స్, బయో-టు-ఎక్స్, ఈ-కామర్స్ వంటి రంగాలు కెమికల్స్ కోసం భారీ డిమాండ్‌ను సృష్టిస్తున్నాయి. ఈ రంగాలు మాత్రమే 2030 నాటికి అదనంగా 30-35 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను సృష్టించనున్నాయి. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కారణంగా కన్స్ట్రక్షన్ కెమికల్స్ వ్యాపారం 2030 నాటికి రెట్టింపు అయ్యి 28 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నివేదిక స్పష్టం చేసింది.

గత పదేళ్ల డేటాను పరిశీలిస్తే, భారతీయ కెమికల్ రంగం ఇన్వెస్టర్లకు ఏడాదికి సగటున 17 శాతం రిటర్న్స్‌ను అందించింది. ఇది ప్రపంచంలోని ఇతర పెద్ద మార్కెట్ల కంటే చాలా ఎక్కువ. అయితే, నాణేనికి మరో వైపు కూడా ఉంది. ప్రస్తుతం భారత్ ఇన్-ఆర్గానిక్, పాలిమర్ కెమికల్స్ కోసం విదేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. దీనివల్ల దాదాపు 31 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడుతోంది. ముఖ్యంగా ఎసిటిక్ యాసిడ్, స్టైరీన్ వంటి రసాయనాలను మనం దిగుమతి చేసుకుంటున్నాం. వీటిని మన దేశంలోనే తయారు చేస్తే దిగుమతి భారం తగ్గడమే కాకుండా, విదేశీ ఎగుమతుల ద్వారా భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉంది.

ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే భారతీయ కంపెనీలు తమ వ్యాపార శైలిని మార్చుకోవాలని మ్యాకిన్సే సూచించింది. కేవలం దేశీయ మార్కెట్ పైనే కాకుండా ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలు, కొనుగోళ్లపై దృష్టి పెట్టాలి. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పై ఖర్చు పెంచడంతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని పెంచడం ద్వారా పనితీరును మెరుగుపరుచుకోవాలని నివేదిక పేర్కొంది. సరఫరా గొలుసును బలోపేతం చేసుకుంటే అంతర్జాతీయంగా వచ్చే ఒడిదుడుకులను తట్టుకుని భారత్ ఈ రంగంలో విశ్వగురువుగా ఎదిగే అవకాశం ఉందని నివేదిక సారాంశం.

Tags:    

Similar News