Indian Economy Growth : దూసుకుపోతున్న భారత ఆర్థిక ఇంజన్.. 2027 నాటికి 7.2 శాతం వృద్ధి ఖాయం
2027 నాటికి 7.2 శాతం వృద్ధి ఖాయం
Indian Economy Growth : ప్రపంచ ఆర్థిక రంగంలో భారత దేశం ఒక వెలుగు వెలిగేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఆర్థిక సలహా సంస్థ ఈవై ఎకానమీ వాచ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2027 ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.8 శాతం నుంచి 7.2 శాతం వరకు వృద్ధి రేటును నమోదు చేసే అవకాశం ఉంది. ఈ వేగవంతమైన ఆర్థిక పురోగతి వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గుముఖం పట్టడమే కాకుండా, మార్కెట్‌లో నగదు లభ్యత కూడా పెరగనుంది. ప్రభుత్వం తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు, దీర్ఘకాలిక ప్రణాళికలే ఈ విజయానికి పునాది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం అంకెల్లో పెరుగుదల మాత్రమే కాదు, సామాన్యుడి ఆర్థిక పరిస్థితిని మార్చే ఒక శుభసూచకం.
భారత్ ఇతర దేశాలతో కుదుర్చుకుంటున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు దేశ ఆర్థిక రూపురేఖలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈవై ఇండియా ముఖ్య సలహాదారు డి.కె.శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం, ప్రపంచంలోని దిగ్గజ ఆర్థిక వ్యవస్థలతో భారత్ తన నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించుకుంది. దీనివల్ల మన దేశ ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ పెరగడమే కాకుండా, విదేశీ పెట్టుబడులు కూడా భారత్‌కు పోటెత్తుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో జరుగుతున్న సంస్కరణలు భారత మార్కెట్‌ను ఒక గ్లోబల్ పవర్‌హౌస్‌గా నిలబెడుతున్నాయి.
సామాన్యులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం ఆదాయపు పన్ను, జీఎస్టీ నిర్మాణంలో కీలక మార్పులు చేసింది. ప్రజల చేతుల్లో ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బు ఉండాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. ప్రజల ఆదాయం పెరిగి, వారు ఖర్చు చేయడం మొదలుపెడితేనే దేశ ఆర్థిక చక్రం వేగంగా తిరుగుతుంది. అయితే, పన్నుల్లో రాయితీలు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఆదాయాని కొంత గండి పడే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. 2026 బడ్జెట్‌లో అనుకున్న పన్ను వసూళ్ల లక్ష్యాలను చేరుకోవడం కాస్త కష్టమే అయినా, ఆర్థిక లోటును నియంత్రించడంలో ప్రభుత్వం సఫలమవుతుందని విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోదీ నిర్దేశించుకున్న వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ఐదేళ్లు చాలా కీలకం. దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే జీడీపీలో పన్నుల వాటా పెరగాలి. ఇప్పటికే ప్రధాన పన్ను సంస్కరణలు పూర్తయినందున, ఇకపై కొత్త పన్నులు వేయడం కంటే ఉన్న నిబంధనలను కఠినంగా అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. పన్ను ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపుతూనే, నిజాయితీగా పన్ను కట్టే వారికి ప్రోత్సాహకాలు అందించనున్నారు. మొత్తం మీద భారత్ ఒక పటిష్టమైన ఆర్థిక భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోంది.