Energy Security : ప్రపంచమంతా చీకట్లోకి వెళ్లినా భారత్ వెలుగుతూనే ఉంటుంది.. మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్
మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్
Energy Security : ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, భారత ప్రభుత్వం మన ఇంధన భద్రతపై గట్టి భరోసా ఇచ్చింది. బొగ్గు, పెట్రోలియం, విదేశీ వ్యవహారాల శాఖలు సంయుక్తంగా సమీక్ష జరిపి, దేశంలో కరెంటు కోతలుగానీ, గ్యాస్ కొరతగానీ రాకుండా పక్కా ప్లాన్‌ను సిద్ధం చేశాయి. యుద్ధం మన దాకా రాకపోయినా, దాని ప్రభావం మన వంటింట్లో పడకుండా కేంద్రం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. దేశంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నా, భయపడాల్సిన అవసరం లేదని బొగ్గు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 55 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. ఎలాంటి సరఫరా లేకపోయినా, ఈ నిల్వలతో వరుసగా 24 రోజుల పాటు దేశమంతటా నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయవచ్చు. రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా బొగ్గును కేటాయించాలని కోల్ ఇండియాకు ఆదేశాలు అందాయి.
అంతర్జాతీయంగా ముడిచమురు, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉన్నందున కేంద్ర పెట్రోలియం శాఖ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు అందే డొమెస్టిక్ ఎల్పీజీ సరఫరాలో లోటు రాకుండా చూసేందుకు, పారిశ్రామిక రంగానికి షాక్ ఇచ్చింది. ఫార్మా, అగ్రికల్చర్, స్టీల్ వంటి 16 రకాల పరిశ్రమలకు కేవలం 70 శాతం గ్యాస్‌ను మాత్రమే కేటాయించాలని నిర్ణయించింది. దీనివల్ల గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత రాదు.
గ్యాస్ సిలిండర్ల అక్రమ రవాణా, నిల్వలపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో దాడులు నిర్వహించి 56,000 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు అతిక్రమించిన 51 మంది డిస్ట్రిబ్యూటర్ల లైసెన్సులను రద్దు చేస్తూ కఠిన చర్యలు తీసుకున్నారు. సప్లై చైన్‌లో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని ప్రభుత్వం హెచ్చరించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే షిప్పుల కోసం భారత్ ఇరాన్‌కు టోల్ చెల్లిస్తోందన్న వార్తలను విదేశీ వ్యవహారాల శాఖ కొట్టిపారేసింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రవాణాకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధ విరమణను భారత్ ఆహ్వానించింది, ఎందుకంటే అక్కడ శాంతి నెలకొంటేనే ప్రపంచ ఇంధన నెట్‌వర్క్ స్థిరంగా ఉంటుంది.