Forex Reserve: విదేశీ మారకద్రవ్య నిల్వల్లో వరుసగా రెండో వారం తగ్గుదల.. 700.898 బిలియన్ డాలర్లకు చేరిక
| 700.898 బిలియన్ డాలర్లకు చేరిక
Forex Reserve: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు వరుసగా రెండో వారం కూడా తగ్గుముఖం పట్టాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, నవంబర్ 20తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్ నిల్వలు 4.443 బిలియన్ డాలర్లు తగ్గి 700.898 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు వారంలో ఏకంగా 14.205 బిలియన్ డాలర్ల భారీ తగ్గుదల నమోదై, నిల్వలు 705.342 బిలియన్ డాలర్లకు చేరాయి. 2026 సెప్టెంబర్ 4న 785.706 బిలియన్ డాలర్ల ఆల్-టైమ్ రికార్డు స్థాయిని తాకిన తర్వాత నిల్వల్లో క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. ప్రవాస భారతీయుల నుంచి ప్రత్యేక పథకం ద్వారా బ్యాంకులు రికార్డు స్థాయిలో 133 బిలియన్ డాలర్ల విదేశీ నిధులను సమీకరించిన సమయంలో నిల్వలు భారీగా పెరిగాయి.
విదేశీ కరెన్సీ ఆస్తుల విలువలో మార్పులు
విదేశీ మారకద్రవ్య నిల్వల్లో ప్రధాన వాటా విదేశీ కరెన్సీ ఆస్తులదే ఉంటుంది. నవంబర్ 20తో ముగిసిన వారంలో ఈ ఆస్తులు 266 మిలియన్ డాలర్లు (26.6 కోట్ల డాలర్లు) తగ్గి 583.186 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ నిల్వల్లో అమెరికా డాలర్‌తో పాటు యూరో, బ్రిటిష్ పౌండ్, జపనీస్ యెన్ వంటి కరెన్సీలు ఉంటాయి. డాలర్‌తో పోలిస్తే ఇతర కరెన్సీల విలువలో వచ్చే హెచ్చుతగ్గులు కూడా నిల్వల లెక్కలపై ప్రభావం చూపుతాయి.
బంగారం నిల్వల్లోనూ వరుస తగ్గుదల
దేశ బంగారం నిల్వల్లోనూ వరుసగా రెండో వారం తగ్గుదల నమోదైంది. ఆర్బీఐ వివరాల ప్రకారం, సమీక్షా వారంలో గోల్డ్ రిజర్వ్స్ విలువ 4.095 బిలియన్ డాలర్లు తగ్గి 94.519 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద ఉండే ప్రత్యేక డ్రాయింగ్ రైట్స్ 67 మిలియన్ డాలర్లు (6.7 కోట్ల డాలర్లు) తగ్గి 18.451 బిలియన్ డాలర్లకు చేరాయి. అలాగే IMFలో భారత్ రిజర్వ్ స్థితి 15 మిలియన్ డాలర్లు (1.5 కోట్ల డాలర్లు) తగ్గి 4.743 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది.