Energy Drinks: భారతదేశంలో మద్యం లేని ప్యాక్డ్ పానీయాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. వినియోగదారుల అభిరుచుల్లో వస్తున్న మార్పులతో కేవలం దాహం తీర్చుకోవడానికి సాధారణ శీతల పానీయాలు లేదా జ్యూస్‌లు తాగడం తగ్గిపోయింది. శరీరానికి తక్షణ శక్తినిచ్చేవి, ప్రోటీన్ అవసరాలు తీర్చేవి, డీహైడ్రేషన్ తగ్గించే పానీయాల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత నాన్-ఆల్కహాలిక్ రెడీ-టు-డ్రింక్ మార్కెట్ FY30 నాటికి రూ.2.56 లక్షల కోట్లకు చేరుకోవచ్చని డోలట్ క్యాపిటల్ నివేదిక అంచనా వేసింది. ఈ మార్కెట్ ఏటా సుమారు 13 శాతం చొప్పున వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపింది.

ఎనర్జీ డ్రింకులు, ఎలక్ట్రోలైట్ పానీయాలకు ఊపు

ఎనర్జీ డ్రింకులు, శరీరానికి నీటితో పాటు అవసరమైన ఖనిజాలను అందించే హైడ్రేషన్ పానీయాల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. వీటి వృద్ధి మొత్తం పానీయాల రంగం కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. FY26లో సుమారు రూ.9,300 కోట్లుగా ఉన్న ఎనర్జీ డ్రింక్స్ మార్కెట్ FY30 నాటికి రూ.29,000 కోట్లకు చేరవచ్చని అంచనా. FY26–FY31 మధ్య ఈ విభాగం ఏటా సగటున 25.6 శాతం వృద్ధి సాధిస్తుందని నివేదిక పేర్కొంది. మరోవైపు ప్యాకేజ్డ్ వాటర్‌ను దాటి సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉండే రికవరీ డ్రింకులకు ఆదరణ పెరుగుతోంది. అడ్వాన్స్‌డ్ హైడ్రేషన్ మార్కెట్ FY26లో రూ.4,200 కోట్ల నుంచి FY30 నాటికి రూ.15,800 కోట్లకు ఎగబాకవచ్చని, ఏటా 30.2 శాతం వృద్ధి నమోదు కావచ్చని అంచనా వేశారు. హిందుస్తాన్ యూనిలీవర్, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ రంగంలోకి అడుగుపెట్టాయి.

జిమ్ దాటి సామాన్యుడి దగ్గరకు ప్రోటీన్ డ్రింకులు

పానీయాల మార్కెట్లో మరో కీలక మార్పు ప్రోటీన్ ఆధారిత డ్రింకుల రూపంలో కనిపిస్తోంది. గతంలో ప్రోటీన్ అంటే కేవలం పౌడర్లు, సప్లిమెంట్లకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు రెడీ-టు-డ్రింక్ ప్రోటీన్ పానీయాలను కంపెనీలు సిద్ధం చేస్తున్నాయి. వ్యాయామం చేసేవారితో పాటు సాధారణ వినియోగదారులు కూడా రోజువారీ అలవాటుగా వీటిని తీసుకునేలా ఉత్పత్తులను తీర్చిదిద్దుతున్నారు. ఆరోగ్యం, పోషకాహారంపై పెరుగుతున్న శ్రద్ధ ఈ విభాగానికి కొత్త ఊపునిస్తోంది.

జీరో షుగర్ పానీయాలపై కంపెనీల దృష్టి

చక్కెర తక్కువగా ఉండే, అసలు చక్కెర లేని పానీయాల కోసం వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో సంస్థలు జీరో షుగర్ డ్రింకులు, కొత్త రుచులను మార్కెట్లోకి తెస్తున్నాయి. వరుణ్ బేవరేజెస్ సంస్థ మధ్యస్థ ధరల ఎనర్జీ డ్రింక్ విభాగంలో యాడ్ రష్, ప్రీమియం మిక్సర్ విభాగంలో ఎవర్‌వెస్ ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. ప్రోటీన్ ఫుడ్స్, రెడీ-టు-ఈట్ ఆహారం, ప్రత్యేక పదార్థాలతో కూడిన పర్సనల్ కేర్ ఉత్పత్తులపైనా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. సంప్రదాయ ఉత్పత్తులను దాటి ఆరోగ్యం, నాణ్యత, ప్రీమియం అనుభూతి వైపు వినియోగదారులు సాగుతున్నారని డోలట్ క్యాపిటల్ నివేదిక స్పష్టం చేసింది.

Tags: