India Oil Exports : ప్రపంచానికి భారతదేశమే దిక్కు.. రికార్డు స్థాయికి చేరిన భారత ఆయిల్ ఎగుమతులు

భారత ఆయిల్ ఎగుమతులు

Update: 2026-08-04 08:53 GMT

 India Oil Exports : గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత, పశ్చిమ దేశాల్లో డీజిల్ తీవ్ర కొరత నడుమ భారత చమురు శుద్ధి రంగం సరికొత్త చరిత్ర సృష్టించింది. జులై 2026 నెలలో భారతదేశం నుంచి డీజిల్, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల మొత్తం ఎగుమతులు గడిచిన 12 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల తీవ్రత, రష్యా ప్రభుత్వం డీజిల్ ఎగుమతులపై విధించిన ఆంక్షలు, యూరప్‌లో పడిపోయిన డీజిల్ నిల్వలు భారత ఆయిల్ కంపెనీలకు విపరీతమైన ఆదాను, మార్జిన్లను తెచ్చిపెట్టాయి. ఆసియాలోనే ప్రధాన స్వింగ్ సప్లైయర్‎గా భారత్ అవతరించింది.

రోజుకు 15.3 లక్షల బారెళ్ల ఎగుమతి

షిప్పింగ్ డేటా విశ్లేషణా సంస్థ కెప్లర్ అందించిన గణాంకాల ప్రకారం.. గడిచిన జులై నెలలో భారతదేశం రోజుకు సగటున 1.53 మిలియన్ బారెళ్ల శుద్ధి చేసిన ఇంధనాన్ని విదేశాలకు ఎగుమతి చేసింది. ఇది గత 12 నెలల సగటు కంటే ఏకంగా 27 శాతం ఎక్కువ. 2017 నుంచి కెప్లర్ డేటాను పరిశీలిస్తే, ఏ జులై నెలలోనూ ఈ స్థాయి ఎగుమతులు జరగలేదని నిపుణులు చెబుతున్నారు. యూరప్‌కు సుమారు 40 నుంచి 50 లక్షల బారెళ్లు, బ్రెజిల్‌కు 28 లక్షల బారెళ్ల డీజిల్‌ను భారత్ సరఫరా చేసింది.

కలిసొచ్చిన రష్యా ఆంక్షలు, యూరప్ డీజిల్ సంక్షోభం

ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యన్ రిఫైనరీలు దెబ్బతినడంతో, ఆ దేశం తన ఆంతరంగిక అవసరాల కోసం పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై నిషేధం విధించింది. దీనితో సాంప్రదాయకంగా రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసే టర్కీ వంటి దేశాలు ఇప్పుడు భారతీయ కార్గోల వైపు మొగ్గు చూపాయి. మరోవైపు, యూరప్ సాధారణంగా పశ్చిమ ఆసియా నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. అయితే అక్కడి యుద్ధ పరిస్థితుల వల్ల సరఫరా ఆగిపోవడంతో, యూరప్ దేశాల చూపు భారత్ వైపు మళ్లింది. ముడిచమురు, డీజిల్ ధరల మధ్య తేడా రికార్డు స్థాయిలో ఉండటంతో భారత రిఫైనరీలకు భారీ లాభాలు చేకూరాయి.

రిలయన్స్, నయారా ఎనర్జీ హవా

భారత్ నుంచి జరిగిన ఇంధన ఎగుమతుల్లో ప్రైవేట్ దిగ్గజాలు రిలయెన్స్ ఇండస్ట్రీస్ (RIL), నయారా ఎనర్జీ కీలక పాత్ర పోషించాయి. భారత్ నుంచి జరిగే మొత్తం శుద్ధి చేసిన ఇంధన ఎగుమతుల్లో దాదాపు ముప్పావు వంతు (75 శాతం) వాటా రిలయెన్స్ ఇండస్ట్రీస్‌దే కావడం విశేషం. ప్లాంట్లలో నిర్వహణ పనులు పూర్తి కావడంతో రిలయెన్స్, నయారాలు పూర్తి స్థాయిలో ఉత్పత్తిని పెంచాయి. అంతేకాకుండా ఇరాన్-అమెరికా మధ్య తాత్కాలికంగా కుదిరిన శాంతి వాతావరణం వల్ల ముడిచమురు సరఫరా క్రమబద్ధీకరించబడటం భారత ఆయిల్ కంపెనీలకు మరింత ఊతాన్నిచ్చింది.

Tags:    

Similar News