Tax Collection : పన్నుల వేటలో కేంద్రం సక్సెస్.. రూ.15.52 లక్షల కోట్ల లక్ష్యం పూర్తి.. ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం
రూ.15.52 లక్షల కోట్ల లక్ష్యం పూర్తి.. ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం
Tax Collection : భారత ప్రభుత్వం పన్ను వసూళ్లలో మరో మైలురాయిని అధిగమించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పరోక్ష పన్నుల వసూళ్లలో కేంద్రం అద్భుతమైన పనితీరును కనబరిచింది. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఎక్కువే ఆదాయం రావడంతో ప్రభుత్వ ఖజానా కళకళలాడుతోంది. కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్‌టీ.. ఇలా అన్ని విభాగాల్లోనూ వసూళ్లు జోరుగా సాగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మోదీ ప్రభుత్వం పరోక్ష పన్నుల వసూళ్లలో తన సత్తా చాటింది. బడ్జెట్ అంచనాల ప్రకారం నిర్ణయించుకున్న రూ.15.52 లక్షల కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం విజయవంతంగా అధిగమించింది. ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, సవరించిన అంచనాల కంటే వసూళ్లు మెరుగ్గా ఉన్నాయి. దేశంలో వినియోగం పెరగడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కస్టమ్స్, ఎక్సైజ్ శాఖల అద్భుత పనితీరు
ఈసారి పన్ను వసూళ్లలో కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీలు కీలక పాత్ర పోషించాయి. కస్టమ్స్ డ్యూటీ వసూళ్లు లక్ష్యం కంటే 102 శాతంగా ఉండగా, ఎక్సైజ్ డ్యూటీ 101 శాతం మేర నమోదయ్యాయి. అంటే ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువే ఆదాయం ఈ విభాగాల నుంచి వచ్చింది. ఇక సెంట్రల్ జీఎస్‌టీ విషయానికి వస్తే, అది 100.8 శాతంగా ఉంది. మొత్తం మీద జీఎస్‌టీ, ఇతర పరోక్ష పన్నుల వసూళ్లు 101.2 శాతానికి చేరడం ప్రభుత్వ ఆర్థిక పటిష్టతకు నిదర్శనంగా నిలిచింది.
పాన్ మసాలా సెస్‌లో వెనకడుగు
అన్ని విభాగాల్లో వసూళ్లు బాగున్నా, హెల్త్, నేషనల్ సెక్యూరిటీ సెస్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ముఖ్యంగా పాన్ మసాలా తయారీ యూనిట్లపై విధించే ఈ సెస్ ద్వారా రూ.2,330 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 63 శాతం మాత్రమే వసూలైంది. ఈ కొత్త సెస్ విధానం 2026 ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి వచ్చింది. 40 శాతం జీఎస్‌టీకి అదనంగా ఈ సెస్‌ను విధిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వ్యవస్థ కుదురుకుంటోంది కాబట్టి, రానున్న రోజుల్లో ఈ వసూళ్లు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
భవిష్యత్ లక్ష్యాలు.. వ్యూహాలు
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ సెస్ ద్వారానే రూ.14,000 కోట్లు రాబట్టాలని కేంద్రం పక్కా ప్లాన్‌తో ఉంది. పన్నుల ఎగవేతను అరికట్టడం, వసూళ్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తోంది. FY26 ఫలితాలు ప్రభుత్వానికి పెద్ద బూస్ట్‌ని ఇచ్చాయి. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్ పెరగడం వల్ల జీఎస్‌టీ వసూళ్లు ప్రతి నెలా రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఇదే ఊపు కొనసాగితే భారత్ తన ఆర్థిక వృద్ధి లక్ష్యాలను సులభంగా చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.