Oil Imports : భారత్‌కు రష్యా భరోసా.. మార్చిలో 90 శాతం పెరిగిన చమురు దిగుమతులు

మార్చిలో 90 శాతం పెరిగిన చమురు దిగుమతులు

Update: 2026-04-03 07:53 GMT

Oil Imports : పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మూతపడటంతో గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు వచ్చే ఇంధనం నిలిచిపోయింది. అయితే, ఈ సంక్షోభాన్ని భారత్ చాలా చాకచక్యంగా అధిగమించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. మార్చి నెలలో భారత్ రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను ఫిబ్రవరితో పోలిస్తే ఏకంగా 94 శాతం పెంచింది. అంటే ఫిబ్రవరిలో రోజుకు 10.6 లక్షల బ్యారెల్స్ దిగుమతి చేసుకుంటే, మార్చిలో అది 20.6 లక్షల బ్యారెల్స్‌కు చేరింది. అమెరికా ఇచ్చిన 30 రోజుల వెసులుబాటు కూడా భారత్‌కు కలిసివచ్చింది.

ఆఫ్రికా నుంచి కొత్త ఆశలు

హోర్ముజ్ జలసంధిలో అడ్డంకుల వల్ల ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల నుంచి భారత్‌కు వచ్చే చమురు వాటా భారీగా తగ్గిపోయింది. ఇరాక్ నుంచి దిగుమతులు దాదాపు 76 శాతం మేర పడిపోయాయి. ఈ లోటును పూడ్చుకోవడానికి భారత్ కేవలం రష్యాపైనే కాకుండా అంగోలా, గబాన్, ఘనా, కాంగో వంటి ఆఫ్రికా దేశాల వైపు మొగ్గు చూపింది. అంగోలా నుంచి దిగుమతులు మూడు రెట్లు పెరగడం గమనార్హం. దీనివల్ల గల్ఫ్ దేశాలపై ఉన్న ఆధారపడటం తగ్గి, భారత్ తన ఇంధన అవసరాల కోసం మార్కెట్‌ను విస్తరించుకోగలిగింది.

ఖతార్ గ్యాస్‌కు గట్టి దెబ్బ.. ఎల్‌పీజీ కష్టాలు

చమురు పరిస్థితి ఇలా ఉంటే, గ్యాస్ సరఫరాలో మాత్రం భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. హోర్ముజ్ మీదుగా వచ్చే ఖతార్ ఎల్‌ఎన్‌జీ దిగుమతులు ఏకంగా 92 శాతం తగ్గిపోయాయి. ఖతార్ ఎనర్జీ సంస్థ ఫోర్స్ మెజ్యోర్ (అనివార్య కారణాలతో సరఫరా నిలిపివేత) ప్రకటించడంతో భారత్‌లోని పరిశ్రమలకు గ్యాస్ కొరత ఏర్పడింది. అయితే, డొమెస్టిక్ ఉత్పత్తిని పెంచడం ద్వారా, వాణిజ్య అవసరాలకు సరఫరాను తగ్గించి, దేశంలోని 33 కోట్ల మంది గృహ వినియోగదారులకు వంట గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.

ఏప్రిల్‌లోనూ ఇదే జోరు.. వెనిజులా ఎంట్రీ

ముందు ముందు కూడా భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏప్రిల్ నెల నుంచి వెనిజులా నుంచి కూడా ముడిచమురు దిగుమతులు ప్రారంభం కానున్నాయి. ఇది భారత్‌కు మరింత ఊరటనిచ్చే విషయం. సౌదీ అరేబియా, యూఏఈ దేశాలు హోర్ముజ్ జలసంధిని కాదని వేరే పైప్‌లైన్ల ద్వారా చమురును పంపే ప్రయత్నాలు చేస్తున్నాయి. యుద్ధం ఎన్ని రోజులు సాగినా, దేశంలో ఇంధన కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉంది.

Tags:    

Similar News