Semiconductor Industry : భారత్‌లో చిప్‌ల సునామీ.. 2035 నాటికి 300 బిలియన్ డాలర్లకు సెమీకండక్టర్ మార్కెట్
2035 నాటికి 300 బిలియన్ డాలర్లకు సెమీకండక్టర్ మార్కెట్
Semiconductor Industry : భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి 2030 నాటికి మూడు రెట్లు పెరిగి 120 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, ఇక 2035 నాటికి ఏకంగా 300 బిలియన్ డాలర్ల మార్కును తాకుతుందని డెలాయిట్ నివేదిక అంచనా వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగడం, ఎలక్ట్రిక్ వాహనాల హవా, డేటా సెంటర్ల విస్తరణ ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం మన దేశ సెమీకండక్టర్ మార్కెట్ ఏడాదికి 20 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాలకు భారత్ ఒక ప్రధాన సరఫరాదారుగా మారుతుంది.
సొంత కాళ్లపై నిలబడనున్న భారత్
ప్రస్తుతం మనం సెమీకండక్టర్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాం. కానీ 2035 చివరి నాటికి మన దేశీయ అవసరాల్లో 60 శాతానికి పైగా ఇక్కడే ఉత్పత్తి అయ్యేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశవ్యాప్తంగా 4-5 సిలికాన్ ఫ్యాబ్‌లు, 10 వరకు కాంపౌండ్ ఫ్యాబ్‌లు, సుమారు 25 అసెంబ్లీ అండ్ టెస్టింగ్ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. దీనివల్ల మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఆటోమొబైల్ రంగానికి కావాల్సిన చిప్‌లు మన దగ్గరే దొరుకుతాయి.
20 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన
సెమీకండక్టర్ రంగం పెరగడం అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదు, నిరుద్యోగులకు కూడా ఇది ఒక వరం. 2035 నాటికి ఈ పరిశ్రమలో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. ఇందులో 30 శాతం ఉద్యోగాలు నేరుగా తయారీ రంగంలో, మరో 30 శాతం చిప్ డిజైనింగ్ సేవల్లో, మిగిలిన 40 శాతం ఇతర అనుబంధ పనులలో లభిస్తాయి. ఐటీ రంగం తర్వాత భారత్‌లో అతిపెద్ద ఉద్యోగ కల్పన రంగంగా సెమీకండక్టర్ ఇండస్ట్రీ అవతరించబోతోంది. దీనికోసం నైపుణ్యం కలిగిన యువతకు భారీ డిమాండ్ ఏర్పడనుంది.
పెట్టుబడుల వెల్లువ.. సవాళ్లు కూడా
ప్రభుత్వం చేపట్టిన ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఇప్పటికే 19 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. రాబోయే ఐదేళ్లలో మరో 50 బిలియన్ డాలర్లు, ఆ తర్వాత 2035 నాటికి అదనంగా 80 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ వృద్ధిని నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వ విధానాలు దీర్ఘకాలికంగా ఉండాలని డెలాయిట్ హెచ్చరించింది. భూమి, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలను సులభంగా అందించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెరగాలని సూచించింది. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు ఇస్తే విదేశీ కంపెనీలు భారత్‌కు క్యూ కడతాయని నివేదిక స్పష్టం చేసింది.