Trade Deficit: జూన్ 2026లో భారత్ మర్చండైజ్ వాణిజ్య లోటు ఐదు నెలల గరిష్ఠ స్థాయి అయిన 30.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి ఆందోళనా చెందడం లేదు. లోక్‌సభలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ రాతపూర్వక సమాధానంలో ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ఒకే ఒక్క నెలలో పెరిగిన వాణిజ్య లోటు ఆధారంగా మొత్తం ఏడాది పనితీరును అంచనా వేయలేమని ఆయన తెలిపారు. జూన్ నెల లోటు గత 12 నెలల సగటు లోటు అయిన 29.3 బిలియన్ డాలర్ల కంటే కొద్దిగా మాత్రమే ఎక్కువని, ఇది ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి నిర్మాణపరమైన బలహీనతను సూచించడం లేదని స్పష్టం చేశారు.

దిగుమతుల్లో ఏ వస్తువుల వాటా ఎంత?:

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పారిశ్రామిక ఉత్పత్తి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడం వల్లే ఈ లోటు ఏర్పడిందని మంత్రి వివరించారు.

* ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు: దేశ మొత్తం దిగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తుల వాటా దాదాపు 26 శాతంగా ఉంది.

* యంత్రాలు, క్యాపిటల్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్: యంత్రాలు, క్యాపిటల్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు కలిసి మొత్తం దిగుమతుల్లో నాలుగో వంతు (25%) ఆక్రమించాయి.

* బంగారం, రత్నాలు: ఆభరణాలు, బంగారం, విలువైన రాళ్ల వాటా దాదాపు 14 శాతంగా ఉంది.

ఆర్థిక పునాదులు భద్రం - బలమైన పాయింట్లు:

ప్రభుత్వం ఇచ్చే వివరణ ప్రకారం దేశ బాహ్య రంగానికి సంబంధించి ఆర్థిక సూచీలు అత్యంత దృఢంగా ఉన్నాయి.

* కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (CAD): 2025-26 ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ జీడీపీలో కేవలం 0.6 శాతానికి తగ్గిపోయింది.

* విదేశీ మారక నిల్వలు : జూన్ 2026 నాటికి భారత విదేశీ మారక నిల్వలు ఏకంగా 671.6 బిలియన్ అమెరికన్ డాలర్ల రికార్డు స్థాయిలో ఉన్నాయి.

* సర్వీసెస్ ట్రేడ్ అండ్ రెమిటెన్సెస్: సేవా రంగం నుంచి వస్తున్న భారీ మిగులు ఆదాయం, విదేశాల నుంచి వచ్చే విదేశీ మారకద్రవ్యం చెల్లింపుల సమతుల్యతను కాపాడుతున్నాయి.

దిగుమతుల తగ్గింపునకు ప్రభుత్వ వ్యూహాలు

విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, కీలక ఖనిజాలు, అధునాతన తయారీ రంగాలలో దేశీయ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తోంది. దీనికోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్, పిఎమ్ గతిశక్తి, నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ వంటి కార్యక్రమాలను వేగవంతం చేసింది. ముడి చమురు, ఎరువులు వంటి నిత్యావసరాల కొనుగోలు మార్గాలను విస్తరిస్తూనే, క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లు, సుంకాలను క్రమబద్ధీకరించడం ద్వారా గ్లోబల్ కాంపిటీటివ్ ఎకానమీని నిర్మించాలని కేంద్రం భావిస్తోంది.

Tags: