Bank Loan: దేశంలోని ప్రభుత్వ బ్యాంకులకు భారీ షాక్ తగిలింది. అప్పులు చెల్లించే స్థోమత ఉన్నప్పటికీ, కావాలని లోన్లు ఎగ్గొట్టిన డిఫాల్టర్లు ప్రభుత్వ బ్యాంకులకు ఏకంగా రూ. 2.85 లక్షల కోట్ల మేర బకాయి పడ్డారు. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమర్పించిన రాతపూర్వక నివేదిక ప్రకారం.. జూన్ 30, 2026 నాటికి రూ. 25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వారి సంఖ్య దాదాపు 16 వేలకు చేరుకుంది. ఇది సామాన్య ప్రజలు దాచుకున్న కష్టార్జితం కావడం గమనార్హం.

16 వేల ఖాతాలు - విల్ఫుల్ డిఫాల్టర్లుగా ప్రకటన

పార్లమెంట్‌లో వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల్లో మొత్తం 15,930 ఖాతాలను విల్ఫుల్ డిఫాల్టర్లుగా ప్రకటించారు. ఈ ఖాతాదారులందరూ కనీసం రూ. 25 లక్షల నుంచి వందల కోట్ల వరకు బకాయిలు కలిగి ఉన్నారు. ఈ బకాయిల మొత్తం విలువ రూ. 2,85,015 కోట్లకు పైగా ఉంది. రుణం తిరిగి చెల్లించే ఆర్థిక సామర్థ్యం పుష్కలంగా ఉన్నప్పటికీ, బ్యాంకుల డబ్బును తిరిగి చెల్లించాలనే ఉద్దేశం లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది.

7,190 మందిపై క్రిమినల్ కేసులు నమోదు

ఈ భారీ ఆర్థిక నష్టాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించింది. కేంద్ర మంత్రి నివేదిక ప్రకారం, మొత్తం 15,930 విల్ఫుల్ డిఫాల్టర్లలో 7,190 కేసుల్లో నేరుగా క్రిమినల్ చర్యలు ప్రారంభమయ్యాయి. అంటే బ్యాంకుల సొమ్మును కాజేసి పరారవ్వాలని చూసేవారు లేదా కావాలని ఎగ్గొట్టేవారు ఇప్పుడు నేరుగా న్యాయపరమైన విచారణలు, క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. బకాయిలను త్వరితగతిన రికవరీ చేయడానికి బ్యాంకులు కోర్టులలో రికవరీ సూట్లు దాఖలు చేయడం వేగవంతం చేశాయి.

ఆస్తుల జప్తునకు సర్ఫేసీ చట్టం ప్రయోగం

క్రిమినల్ కేసులతో పాటు, బాకీల రికవరీ కోసం బ్యాంకులు సర్ఫేసీ చట్టం వంటి అత్యంత కఠినమైన నిబంధనలను పూర్తిస్థాయిలో ఉపయోగిస్తున్నాయి. ఈ చట్టం ద్వారా కోర్టుల చుట్టూ తిరిగే పని లేకుండానే, డిఫాల్టర్లు కుదువబెట్టిన ఆస్తులను బ్యాంకులు నేరుగా జప్తు చేసి వేలం వేసే అధికారం పొందుతాయి. దీనికి తోడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. రూ. 25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఎగ్గొట్టిన ప్రతి డిఫాల్టర్ సమాచారాన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంచారు.

Tags: