Unemployment Rate : దేశంలో స్వల్పంగా పెరిగిన నిరుద్యోగం.. 15 ఏళ్లు పైబడిన వారిలో ఉపాధి సంక్షోభం
15 ఏళ్లు పైబడిన వారిలో ఉపాధి సంక్షోభం
Unemployment Rate : భారతదేశ నిరుద్యోగితా రేటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక గణాంకాలను విడుదల చేసింది. మార్చి 2026 నెలలో ఉపాధి రంగం మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగితా రేటు స్వల్పంగా పెరగడం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, గ్రామీణ మహిళల ఉపాధిలో స్థిరత్వం కనిపించడం కొంత ఊరటనిచ్చే అంశం. జాతీయ గణాంక కార్యాలయం (NSO) తన 12వ నెలవారీ బులిటెన్‌లో ఈ వివరాలను పొందుపరిచింది. కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఎన్ఎస్ఓ విడుదల చేసిన పిఎల్ఎఫ్ఎస్ సర్వే ప్రకారం.. 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో నిరుద్యోగితా రేటు మార్చి 2026లో 5.1 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో ఇది 4.9 శాతంగా ఉండేది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉండటమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. పట్టణాల్లో నిరుద్యోగితా రేటు ఫిబ్రవరిలో 6.6 శాతంగా ఉండగా, మార్చి నాటికి అది 6.8 శాతానికి చేరుకుంది.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఉపాధి విషయంలో మాత్రం సానుకూల సంకేతాలు కనిపించాయి. 15 ఏళ్లు పైబడిన గ్రామీణ మహిళల్లో నిరుద్యోగితా రేటు దాదాపు స్థిరంగా కొనసాగింది. అయితే, ఇదే వయస్సు గల పురుషులలో నిరుద్యోగం స్వల్పంగా పెరిగింది. అఖిల భారత స్థాయిలో సుమారు 3,75,262 మంది వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. పట్టణ ప్రాంతాల్లో కార్మిక భాగస్వామ్య రేటులో పెద్దగా మార్పులు లేకపోవడం విశేషం.
మొత్తం దేశవ్యాప్తంగా శ్రమ శక్తి భాగస్వామ్యం మార్చి నెలలో 55.4 శాతంగా నమోదైంది. ఇది ఫిబ్రవరి నెల (55.9%) తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తగ్గుదల మరింత స్పష్టంగా కనిపించింది. గ్రామీణ ఎల్ఎఫ్పీఆర్ 58.7 శాతం నుంచి 58 శాతానికి పడిపోయింది. మహిళా కార్మిక భాగస్వామ్యం కూడా ఫిబ్రవరిలో 35.3 శాతం ఉండగా, మార్చిలో అది 34.4 శాతానికి పడిపోవడం గమనార్హం. గ్రామీణ మహిళల్లో ఇది 38.9 శాతంగా ఉంటే, పట్టణ మహిళల్లో కేవలం 25.2 శాతంగానే ఉంది.
నివేదిక ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో కార్మికుల జనాభా నిష్పత్తి (WPR) మార్చిలో 46.8 శాతంగా ఉంది. ఫిబ్రవరిలో ఇది 47 శాతంగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో డబ్ల్యూపీఆర్ 56.3 శాతం నుంచి 55.5 శాతానికి తగ్గింది. మొత్తం మీద మార్చి నెలలో ఉపాధి రంగం కొంత ఒడిదుడుకులకు లోనైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. నూతన సర్వే పద్ధతుల ప్రకారం, జనవరి 2025 నుంచి నెలవారీ బులెటిన్లను విడుదల చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం వెలువడిన నివేదిక ఈ సిరీస్‌లో 12వది కావడం విశేషం.