IndiGo : విదేశాలకు వెళ్తున్నారా? అయితే మీ ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. విమాన ప్రయాణంపై బాంబు పేల్చిన ఇండిగో
విమాన ప్రయాణంపై బాంబు పేల్చిన ఇండిగో
IndiGo : విమాన ప్రయాణికులకు షాకిస్తూ దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చేలా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన టికెట్లపై ఫ్యూయల్ ఛార్జ్ పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయంగా విమాన ఇంధనం ధరలు అమాంతం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని సంస్థ పేర్కొంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) నివేదిక ప్రకారం.. గత నెల రోజుల్లోనే విమాన ఇంధనం (ATF) ధరలు ఏకంగా 130 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. ఈ భారాన్ని పూర్తిగా భరించడం ఎయిర్‌లైన్స్‌కు కష్టంగా మారింది. అయితే, కేంద్ర పెట్రోలియం, పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు ప్రయాణికులపై భారం మరీ ఎక్కువగా పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. దేశీయ విమానాల్లో కేవలం 25 శాతం వరకు మాత్రమే పాక్షికంగా ఇంధన రుసుము పెంచడానికి అనుమతినిచ్చాయి.
దేశీయ విమానాల్లో పెరిగిన ఛార్జీలు
ప్రయాణించే దూరాన్ని బట్టి ఇండిగో కొత్త ఫ్యూయల్ ఛార్జీలను ఖరారు చేసింది. కిలోమీటర్ల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:
500 కిలోమీటర్ల వరకు: రూ.275
501 నుండి 1000 కి.మీ: రూ.400
1001 నుండి 1500 కి.మీ: రూ.600
1501 నుండి 2000 కి.మీ: రూ.800
2000 కిలోమీటర్ల కంటే ఎక్కువ: రూ.950
విదేశీ ప్రయాణాలపై భారీ వడ్డింపు
ఇక ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో ప్రయాణించే వారికి ఛార్జీల మోత కాస్త గట్టిగానే ఉండబోతోంది. భారత ఉపఖండంలోని దేశాలకు వెళ్లే వారికి రూ.900 అదనంగా పడుతుండగా, ఇతర దేశాలకు వెళ్లే వారికి దూరాన్ని బట్టి రూ.2,500 నుండి రూ.10,000 వరకు అదనపు భారం పడనుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిపై రూ.3,000 నుండి రూ.5,000 వరకు, యూరోప్, యూకే వెళ్లే వారిపై గరిష్టంగా రూ.10,000 ఫ్యూయల్ ఛార్జ్ విధించారు. ఆఫ్రికాకు రూ.5,000, గ్రీస్,టర్కీకి రూ.7,500 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
భారాన్ని తగ్గించే ప్రయత్నం
ఇంధన ధరలు 130 శాతానికి పైగా పెరిగినప్పటికీ, ఆ భారాన్ని మొత్తం ప్రయాణికులపై మోపలేదని ఇండిగో స్పష్టం చేసింది. టికెట్ ధరలను సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంచేందుకే పరిమితంగా ఈ పెంపును చేపట్టినట్లు ఎయిర్‌లైన్ ప్రతినిధులు తెలిపారు. అయినప్పటికీ, విమాన ప్రయాణం మునుపటి కంటే ఖరీదైనదిగా మారడం ఖాయం. రాబోయే రోజుల్లో మిగతా విమానయాన సంస్థలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.