Intel Corporation : 24,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపిన టెక్నాలజీ దిగ్గజం

ఉద్యోగులను ఇంటికి పంపిన టెక్నాలజీ దిగ్గజం;

Update: 2025-07-25 11:44 GMT

Intel Corporation : ఒకప్పుడు చిప్ సామ్రాజ్యాన్ని ఏలిన ఇంటెల్ కార్పొరేషన్ ఇప్పుడు కష్టాల్లో కూరుకుపోయింది. కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకుంటోంది. ఇప్పటికే 24,500 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియ పూర్తయిందట. దీంతో దాదాపు లక్ష మందికి దగ్గరగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 75,000కు పడిపోయి ఉండొచ్చు. కంపెనీ అనుబంధ సంస్థల్లో పనిచేసేవారిని మినహాయించి, ఈ సంవత్సరం చివరినాటికి 75,000 మంది ప్రధాన ఉద్యోగులను మాత్రమే కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఈఓ లిప్ బు టాన్ గతంలోనే చెప్పారు.

1968లో స్థాపించబడిన ఇంటెల్ కంపెనీ, నాలుగు దశాబ్దాల పాటు చిప్ పరిశ్రమలో అగ్రస్థానంలో నిలిచింది. కానీ, ఆపిల్ ఫోన్ వచ్చిన తర్వాత చిప్ టెక్నాలజీ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం పుంజుకుంది. ఈ సాంకేతిక మార్పులకు ఇంటెల్ తగిన విధంగా స్పందించలేకపోయింది. ఇదే దాని పతనానికి ప్రధాన కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం చిప్ రేసులో ఎన్​విడియా వంటి కంపెనీలు ముందున్నాయి. ఇంటెల్ ఇప్పుడు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఆర్థికంగా కూడా ఇంటెల్ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉన్న త్రైమాసికంలో ఇంటెల్ ఆదాయం కేవలం 12.9 బిలియన్ డాలర్లకు మాత్రమే పరిమితమైంది. ఇందులో 2.9 బిలియన్ డాలర్ల భారీ నష్టం నమోదైంది. గత సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ఈ నష్టాల నుండి బయటపడటానికి ఇంటెల్ తన వివిధ ఖర్చులను నియంత్రిస్తోంది. అందులో భాగంగానే ఉద్యోగులను తొలగించడం, ప్రతి ఉద్యోగి పనితీరును నిశితంగా పర్యవేక్షించడం వంటివి చేస్తోంది. ప్రతి ఖర్చు ఆర్థికంగా లాభం తెచ్చేలా ఉండాలని ఇంటెల్ సీఈఓ స్పష్టం చేశారు.

ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇంటెల్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. జర్మనీ, పోలాండ్ లో ప్లాన్ చేసిన ప్రాజెక్టులను ఇంటెల్ రద్దు చేసుకుంది. అలాగే, కోస్టా రికాలో ఉన్న అసెంబ్లీ, టెస్ట్ కార్యకలాపాలను వియత్నాం, మలేషియాలోని తమ పెద్ద యూనిట్లకు తరలిస్తోంది. ఈ చర్యలు కంపెనీని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతవరకు సహాయపడతాయో చూడాలి.

Tags:    

Similar News