Auto Pay : ఆటో-పే వాడుతున్నారా? జాగ్రత్త.. మీ ప్రమేయం లేకుండానే బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది

మీ ప్రమేయం లేకుండానే బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది

Update: 2026-03-30 09:44 GMT

Auto Pay : ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో బిల్లులు కట్టడం మర్చిపోతామనే భయంతో చాలామంది ఆటో-పే లేదా స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఆప్షన్ ఎంచుకుంటున్నారు. దీనివల్ల నిర్ణీత తేదీన మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అయి బిల్లులు చెల్లించబడతాయి. ఇది వినడానికి చాలా బాగున్నా, కొన్ని ప్రాథమిక విషయాలను నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీ కష్టార్జితం వృథా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నిబంధనలు చదవకుండా సమ్మతి (Consent) తెలపడం వల్ల భవిష్యత్తులో చిక్కులు తప్పవు.

కళ్లు మూసుకుని ఓకే చెప్పకండి

ఏదైనా కొత్త సేవ కోసం ఆటో-పే సెట్ చేసేటప్పుడు మనం తరచుగా నిబంధనలను చదవం. ఇది పెద్ద పొరపాటు. మీరు ఎంత మొత్తాన్ని కట్ చేయడానికి అనుమతిస్తున్నారు? నెలకు ఎన్నిసార్లు డబ్బులు కట్ అవుతాయి? అనే విషయాలను సరిచూసుకోవాలి. విద్యుత్ బిల్లులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు ప్రతి నెలా మారుతూ ఉంటాయి. అటువంటప్పుడు గరిష్ట పరిమితిని సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని నిమిషాల పాటు మీరు చూపే శ్రద్ధ భవిష్యత్తులో వేల రూపాయల నష్టాన్ని తప్పిస్తుంది.

నకిలీ యాప్‌ల వలలో పడకండి

మార్కెట్లో ఇప్పుడు అన్ని బిల్లులను ఒకే చోట కట్టేస్తామంటూ రకరకాల యాప్స్, వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే మీ బ్యాంక్ వివరాలను ఇటువంటి థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌లలో పంచుకోవడం చాలా ప్రమాదం. ఎప్పుడైనా ఆటోమేటిక్ పేమెంట్స్ సెట్ చేయాలంటే మీ బ్యాంక్ అధికారిక యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ మాత్రమే వాడండి. నమ్మదగని యాప్‌లకు యాక్సెస్ ఇస్తే మీ అకౌంట్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది.

సెట్ చేశాం కదా అని వదిలేయకండి

చాలామంది ఆటో-పే సెట్ చేశాక బ్యాంక్ స్టేట్‌మెంట్ చూడటమే మానేస్తారు. టెక్నికల్ లోపాల వల్ల ఒక్కోసారి ఒకే బిల్లు రెండుసార్లు కట్ అవ్వొచ్చు, లేదా అదనపు ఛార్జీలు పడొచ్చు. అందుకే కనీసం నెలకు ఒకసారి మీ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను నిశితంగా పరిశీలించాలి. సైబర్ నేరగాళ్లు మొదట మీ ఖాతా నుండి చాలా చిన్న మొత్తాలను (ఉదాహరణకు రూ.10 లేదా రూ.20) ఆటో-డెబిట్ చేస్తుంటారు. మీరు గమనించడం లేదని తెలిశాక పెద్ద మొత్తంలో దోచుకుంటారు. కాబట్టి చిన్నపాటి తేడా కనిపించినా వెంటనే అప్రమత్తమవ్వాలి.

అనుమానాస్పద లావాదేవీలు జరిగితే ఏం చేయాలి?

మీకు తెలియకుండా మీ ఖాతా నుంచి డబ్బు కట్ అయినట్లు మెసేజ్ వస్తే వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయండి. ఆ పర్టిక్యులర్ స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్‌‎ను తక్షణమే రద్దు చేయమని కోరండి. ఎంత త్వరగా స్పందిస్తే మీ డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. డిజిటల్ బ్యాంకింగ్ కాలంలో మన అప్రమత్తతే మన డబ్బుకు అసలైన రక్షణ కవచం.

Tags:    

Similar News