Viral : షేర్ మార్కెట్‌లో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చనే అత్యాశ అనేక మంది జీవితాలను కోలుకోలేని దెబ్బ తీస్తోంది. తాజాగా ముంబైకి చెందిన 35 ఏళ్ల ఒక ఐటీ మేనేజర్ కథ సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది. నెలకు రూ.1.6 లక్షల జీతం సంపాదిస్తున్నప్పటికీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ వ్యసనం వల్ల అతను దాదాపు రూ.80 లక్షల ఆస్తిని పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం అతడి నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తమే రూ.1.85 లక్షలకు చేరింది. అంటే వచ్చే జీతం కంటే కట్టాల్సిన కిస్తీలే ఎక్కువగా ఉండటంతో ఏమి చేయాలో తోచక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్ వేదికగా తన బాధను పంచుకుంటూ సలహాలు కోరాడు.

కరోనా కాలంలో మొదలైన వ్యసనం

రెడిట్‌లో gaushi1614 అనే అకౌంట్ పేరుతో ఈ ఐటీ మేనేజర్ తన కన్నీటి గాథను బయటపెట్టాడు. కోవిడ్-19 పాండమిక్ లాక్‌డౌన్ సమయంలో కాలక్షేపం కోసం షేర్ మార్కెట్, F&O ట్రేడింగ్‌లోకి అడుగుపెట్టినట్లు తెలిపాడు. మొదట్లో ఇది సరదాగానే సాగినా, ఆ తర్వాత తీవ్రమైన వ్యసనంగా మారిపోయింది. ప్రారభంలో వచ్చిన నష్టాలను ఎలాగైనా భర్తీ చేయాలనే తొందరపాటులో మళ్లీ మళ్లీ పెద్ద మొత్తంలో ట్రేడింగ్స్ చేస్తూ పోయాడు. ఫలితంగా పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయి, ఏకంగా రూ. 80 లక్షల వరకు నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.

జీతం కంటే ఈఎంఐ ఎక్కువ

ప్రస్తుతం ఆ వ్యక్తిపై వివిధ రూపాల్లో దాదాపు రూ. 60 లక్షల భారీ అప్పు ఉంది. పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులు, ఎన్‌బీఎఫ్‌సీలు, రకరకాల డిజిటల్ లోన్ యాప్‌ల నుంచి ఈ అప్పులు తీసుకున్నాడు. కేవలం క్రెడిట్ కార్డ్ బాకీయే రూ.7 లక్షల వరకు ఉంది. నెలకు రూ.1.6 లక్షల రాబడి ఉంటే, ప్రతీ నెలా ఈఎంఐల రూపంలో రూ.1.85 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఏ ఒక్క ఈఎంఐని కూడా డిఫాల్ట్ చేయలేదని, కానీ రాబోయే రోజుల్లో ఇల్లు గడవడమే కష్టంగా మారనుందని వాపోయాడు. కొత్తగా లోన్ తీసుకుని పాత అప్పులు తీరుద్దామంటే బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు తిరస్కరిస్తున్నాయి.

భార్యకు తెలియని నిజం

ఈ దారుణమైన పరిస్థితి గురించి ఇంట్లోని భార్యాపిల్లలకు ఏమాత్రం తెలియకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. అప్పుల విషయాన్ని కుటుంబానికి చెప్పకుండా దాచిపెట్టాడు. ఇప్పుడు రికవరీ ఏజెంట్లు ఎక్కడ ఇంటికి వస్తారో, లేదా ఫోన్లు చేసి వేధిస్తారో అని రాత్రిపూట నిద్ర కూడా పట్టడం లేదని భయపడిపోతున్నాడు. ఇకపై జీవితంలో ట్రేడింగ్ జోలికి వెళ్లనని, తన నెలవారీ ఈఎంఐ ఏమైనా తగ్గి రూ.1.2 లక్షల నుంచి రూ.1.3 లక్షల మధ్యకు వస్తే, ఇల్లు గడుస్తూ నెమ్మదిగా అప్పులు తీర్చుకుంటానని వేడుకున్నాడు.

నెటిజన్లు ఇచ్చిన అమూల్యమైన సలహాలు

ఈ పోస్ట్ వైరల్ కావడంతో అనేకమంది నెటిజన్లు అతనికి ధైర్యాన్నిస్తూ కొన్ని ఉపయోగకరమైన సలహాలు ఇచ్చారు. అత్యధిక వడ్డీ ఉన్న క్రెడిట్ కార్డులు, లోన్ యాప్స్ బాకీలను ముందుగా తీర్చేయాలని సూచించారు. ఇందుకోసం ఇంట్లో ఉన్న బంగారం, కారు లేదా ఏవైనా ఆస్తులు ఉంటే వెంటనే అమ్మేసి లోన్లు క్లోజ్ చేయాలని చెప్పారు. ముందుగా భార్యకు అసలు నిజం చెప్పాలని, ఈ మానసిక ఒత్తిడిని ఒంటరిగా మోయడం మంచిది కాదని హితవు పలికారు. అంతేకాకుండా ట్రేడింగ్ అకౌంట్‌ను శాశ్వతంగా డిలీట్ చేసి, జీవన శైలి ఖర్చులను తక్షణమే తగ్గించుకోవాలని స్పష్టం చేశారు.

Tags: