ITR Filing 2026 : ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ మొదలైంది..ఈసారి ఇల్లు ఉన్నవారికి బంపర్ ఆఫర్

ఈసారి ఇల్లు ఉన్నవారికి బంపర్ ఆఫర్

Update: 2026-04-04 09:40 GMT

ITR Filing 2026 : కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) అడుగుపెట్టింది. దీనితో పాటు పన్ను చెల్లింపుదారులందరిలోనూ ఒకటే ప్రశ్న.. ఈసారి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ ఎప్పుడు మొదలవుతుంది? మీరు కూడా మీ టాక్స్ రిటర్న్స్‌ను సకాలంలో దాఖలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, మీకు ఒక శుభవార్త. ఆదాయపు పన్ను శాఖ అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 కోసం ఐటీఆర్ ఫారమ్‌లను ఇప్పటికే నోటిఫై చేసింది. ఈ నెల నుండే రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియ ఊపందుకోనుంది. సాధారణంగా ప్రతి ఏటా ఏప్రిల్ నెలలోనే ఐటీ రిటర్న్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈసారి కూడా ఆదాయపు పన్ను శాఖ ముందుగానే ఐటీఆర్ ఫారమ్‌లను నోటిఫై చేసింది. త్వరలోనే ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆన్‌లైన్ యూటిలిటీలు యాక్టివేట్ కానున్నాయి. గత ఏడాది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఇండెక్సేషన్ వంటి నిబంధనల్లో మార్పుల వల్ల ఫైలింగ్ కాస్త ఆలస్యమైంది. కానీ ఈసారి ప్రభుత్వం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో, పన్ను చెల్లింపుదారులు ఈ నెల నుండే తమ రిటర్న్స్‌ను దాఖలు చేసే అవకాశం ఉంది.

రిటర్న్స్ ప్రక్రియ మొదలైనప్పటికీ, జీతం వచ్చే ఉద్యోగులు మాత్రం ఐటీఆర్ ఫైల్ చేయడానికి జూన్ వరకు ఆగాల్సిందే. దీనికి ప్రధాన కారణం ఫామ్ 16. ప్రతి ఉద్యోగికి తన ట్యాక్స్ రిటర్న్ సరిగ్గా నింపడానికి కంపెనీ ఇచ్చే ఫామ్ 16 చాలా ముఖ్యం. నిబంధనల ప్రకారం కంపెనీలు జూన్ 15 లోపు తమ ఉద్యోగులకు ఈ ఫారమ్‌ను అందజేయాలి. ఇందులో మీ జీతం ఎంత? ఎంత టీడీఎస్ కట్ అయింది? వంటి ఖచ్చితమైన వివరాలు ఉంటాయి. అవి చేతికి వచ్చిన తర్వాతే రిటర్న్స్ ఫైల్ చేయడం సురక్షితం.

ఏప్రిల్ 1, 2026 నుంచి దేశంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి వచ్చిన మాట నిజమే. దశాబ్దాల కాలం నాటి 1961 చట్టం స్థానంలో ఇది వచ్చింది. అయితే, ఈ ఏడాది మీరు దాఖలు చేసే రిటర్న్స్ (ఆర్థిక సంవత్సరం 2025-26 కి సంబంధించినవి) మాత్రం పాత ఆదాయపు పన్ను చట్టం-1961 నిబంధనల ప్రకారమే సాగుతాయి. అంటే మీరు గతంలో లాగే ప్రీవియస్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ వంటి పాత పద్ధతులనే అనుసరించాలి. పెనాల్టీ లేకుండా రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026 గా నిర్ణయించారు.

ఈసారి ఐటీఆర్ ఫారమ్‌లలో వచ్చిన అతిపెద్ద మార్పు ఇళ్ల యజమానులకు ఊరటనిస్తోంది. గతంలో రెండు ఇళ్లు ఉండి, వాటి ద్వారా ఆదాయం పొందే వారు ఐటీఆర్-2 లేదా ఐటీఆర్-3 వంటి కష్టతరమైన ఫారమ్‌లను నింపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అటువంటి వారు కూడా సులభమైన ఐటీఆర్-1 (సహజ్) ఫారమ్‌ను ఉపయోగించుకోవచ్చని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. అయితే వ్యాపార ఆదాయం ఉన్నవారు, లాటరీ ద్వారా డబ్బు గెలిచిన వారు లేదా సెక్షన్ 112ఏ కింద రూ.1.25 లక్షల కంటే ఎక్కువ క్యాపిటల్ గెయిన్ ఉన్నవారు మాత్రం ఈ ఫారమ్‌ను వాడకూడదు.

Tags:    

Similar News