ITR Filing 2026 : సెక్షన్ 80G కింద టాక్స్ మినహాయింపు కోరుతున్నారా? ఐటీఆర్ ఫైలింగ్‌లో మారిన సరికొత్త నిబంధనలు
ఐటీఆర్ ఫైలింగ్‌లో మారిన సరికొత్త నిబంధనలు
ITR Filing 2026 : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు సెక్షన్ 80G కింద విరాళాలు చూపిస్తూ పన్ను మినహాయింపు పొందే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే ఈసారి ఐటీఆర్ దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు మునుపటి కంటే చాలా జాగ్రత్తగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుత అసెస్మెంట్ ఇయర్ 2026-27కి గాను విడుదల చేసిన కొత్త ఐటీఆర్ ఫారమ్‌లలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సెక్షన్ 80G కింద క్లెయిమ్ చేసే విరాళాల వివరాలను డిజిటల్ పద్ధతిలో క్రాస్ వెరిఫికేషన్ చేయడానికి, నకిలీ క్లెయిమ్‌లకు పూర్తిగా అడ్డుకట్ట వేయడానికి ఐటీ శాఖ అదనపు సమాచారాన్ని సేకరిస్తోంది.
గతంలో ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఏ సంస్థకు ఎంత మొత్తం విరాళంగా ఇచ్చామనే వివరాలు అందిస్తే సరిపోయేది. కానీ, కొత్త నిబంధనల ప్రకారం ఇకపై కేవలం ఆ సమాచారం ఇస్తే సరిపోదు. మీరు యుపీఐ, NEFT, RTGS, IMPS లేదా చెక్ రూపంలో విరాళాలు అందించి ఉంటే.. సదరు చెల్లింపునకు సంబంధించిన ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నంబర్, మీరు డబ్బులు పంపిన మీ సొంత బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ను కూడా ఐటీఆర్ ఫారమ్‌లో కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పన్ను చెల్లింపుదారుడు నిజంగానే ఆ మొత్తాన్ని బ్యాంకు ద్వారా బదిలీ చేశాడా లేదా అనే పూర్తి రికార్డును ఆదాయపు పన్ను శాఖ నేరుగా పరిశీలించగలుగుతుంది.
సెక్షన్ 80G కింద పన్ను మినహాయింపులు కోరడానికి వీలుండే అన్ని రకాల ఐటీఆర్ ఫారమ్‌లలోనూ ఈ సరికొత్త డిస్క్లోజర్ నిబంధనను జోడించారు. ముఖ్యంగా సాధారణ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు ఉపయోగించే ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-3, ఐటీఆర్-4 ఫారమ్‌లలో ఈ మార్పులు వచ్చాయి. వేర్వేరు ఫారమ్‌ల ఫార్మాట్‌ను బట్టి ఈ కాలమ్స్ కొద్దిగా మారినప్పటికీ, అడిగే సమాచారం మాత్రం ఒకటేనని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా అసంపూర్ణ సమాచారం లేదా తప్పుడు నంబర్లు నమోదు చేస్తే మీ ఐటీఆర్ ప్రాసెసింగ్ నిలిచిపోవడమే కాకుండా, సదరు క్లెయిమ్ పూర్తిగా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ పన్ను రిటర్నులను పరిశీలించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తోంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి వచ్చే డేటాతో మీ ఐటీఆర్ లోని వివరాలను సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా సరిపోల్చుకుంటుంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైల్ చేయడానికి ముందే విరాళం ఇచ్చిన రశీదు, బ్యాంక్ స్టేట్‌మెంట్, ట్రాన్సాక్షన్ ఐడీ, ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌లను సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే మీరు విరాళం ఇచ్చిన స్వచ్ఛంద సంస్థకు లేదా ట్రస్ట్‌కు సెక్షన్ 80G కింద ఐటీ శాఖ గుర్తింపు ఉందో లేదో ముందే చెక్ చేసుకోవడం మంచిది. ఊహాగానాలు లేదా అంచనాల ఆధారంగా తప్పుడు వివరాలు నమోదు చేస్తే భవిష్యత్తులో ఐటీ నోటీసులు, అదనపు విచారణలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.