Jaggery Price: పండుగల వేళ సామాన్యుడికి షాక్.. కొండెక్కి కూర్చున్న బెల్లం ధరలు..2027 వరకు తగ్గడం కష్టమే
2027 వరకు తగ్గడం కష్టమే
Jaggery Price: మార్కెట్లో ఇప్పటికే చక్కెర ధరలు ఆకాశాన్నంటుతుండగా, ఇప్పుడు బెల్లం ధరలు కూడా ఒక్కసారిగా పెరిగి సామాన్యుల బడ్జెట్‌ను దెబ్బతీశాయి. రాబోయే దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల సీజన్‌కు ముందే బెల్లం ధరల్లో తీవ్రమైన రికార్డు స్థాయి పెంపు కనిపిస్తోంది. ముంబై ఏపీఎంసీ హోల్‌సేల్ మార్కెట్‌లో ఆగస్టు 25 నాటికి బెల్లం నాణ్యతను బట్టి కిలో రూ.80 నుంచి రూ.100 వరకు ధర పలుకుతోంది. రిటైల్ అవుట్‌లెట్లలో నాణ్యమైన బెల్లం కిలో ధర రూ.100 దాటి విక్రయించబడుతుండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో 30 శాతం వరకు పెంపు
దేశంలోనే ప్రధాన బెల్లం ఉత్పత్తి రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో గడిచిన రెండు వారాల్లోనే బెల్లం ధరలు ఏకంగా 25 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. సాధారణంగా మార్కెట్‌లో చక్కెర ధరలకు అనుగుణంగానే బెల్లం ధరలు కూడా పెరుగుతుంటాయి. ఈ ఏడాది వ్యాపారులు, పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం.. ఆగస్టు నెలలోనే దేశవ్యాప్తంగా బెల్లం ధరలలో 30 శాతానికి పైగా పెరుగుదల నమోదైంది. కొత్త బెల్లం ఉత్పత్తి అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే వరకు మార్కెట్‌లో ఈ అధిక ధరలు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
రాబోయే పండుగలపై ప్రత్యక్ష ప్రభావం
బెల్లం, చక్కెర ధరల పెంపు ప్రభావం రాబోయే పండుగల సీజన్‌లో తయారుచేసే స్వీట్లు, లడ్డూలు మరియు సాంప్రదాయ పిండివంటల తయారీ వ్యయంపై పడనుంది. స్వీట్ల తయారీదారులు, గృహిణులు తీపి పదార్థాల తయారీ కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. రాబోయే కాలంలో చెరకు లభ్యత తగ్గుతుందన్న అంచనాల కారణంగా ఈ అధిక ధరల తాకిడి 2027 సంవత్సరం వరకు కొనసాగే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ధరల పెంపునకు ప్రధాన కారణాలు
వచ్చే ఏడాది దేశంలో చెరకు సాగు, దిగుబడి తగ్గుతుందన్న వార్తలతో వ్యాపారులు ముందస్తుగా నిల్వలను తగ్గించుకోవడం, పండుగల డిమాండ్ క్రమంగా పెరుగుతుండటమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. సరఫరా పరిమితంగా ఉండటంతో అక్టోబర్ నాటికి కొత్త చెరకు క్రషింగ్ ప్రారంభమయ్యే వరకు వినియోగదారులకు మరియు స్వీట్ వ్యాపారులకు ఈ ధరల భారం తప్పదు.