Jio IPO: స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓలకు వేళాయె. రిలయన్స్ జియో ప్లాట్‌ఫార్మ్స్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) తీసుకురానున్న భారీ ఐపీఓలకు సెబీ ఆమోదం తెలిపింది. దాదాపు రూ.37,800 కోట్ల విలువైన ఈ ఇష్యూలపై ఇన్వెస్టర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్న వేళ, గత మెగా ఐపీఓల చరిత్ర మాత్రం భిన్నమైన సంకేతాలిస్తోంది. దేశీయ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్న జియో ప్లాట్‌ఫార్మ్స్ ఐపీఓ సైజు సుమారు 4 బిలియన్ డాలర్లు (రూ.37,800 కోట్లు) ఉండవచ్చని అంచనా. అటు ఎన్ఎస్ఈ కూడా రూ.30,000 కోట్ల భారీ ఆఫర్‌తో ముందుకు వస్తోంది. ఇవి గనుక మార్కెట్లోకి వస్తే, ఇటీవల హ్యుందాయ్ మోటార్స్ నమోదు చేసిన రూ.27,858 కోట్ల రికార్డు తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ తొలి వారంలో జియో ఐపీఓ వచ్చే అవకాశం ఉండటంతో చిన్న, పెద్ద ఇన్వెస్టర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మెగా ఐపీఓల చరిత్ర.. లాభాల కంటే నష్టాలే ఎక్కువా?

పెద్ద ఐపీఓ అనగానే లిస్టింగ్ రోజునే భారీగా లాభాలు దక్కుతాయని సామాన్య ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. అయితే గతాన్ని పరిశీలిస్తే కథ పూర్తిగా వేరుగా ఉంది. గతంలో వచ్చిన ఐదు అతిపెద్ద ఐపీఓలలో కోల్ ఇండియా ఒక్కటే లిస్టింగ్ రోజున 18.78 శాతం లాభాన్ని ఇచ్చింది. మిగిలిన దిగ్గజాలు తీవ్రంగా నిరాశపరిచాయి. హ్యుందాయ్ మోటార్స్ తొలిరోజే 1.33 శాతం నష్టపోగా, టాటా క్యాపిటల్ కేవలం 0.0123 శాతం స్వల్ప లాభానికే పరిమితమైంది. ఇక ఎల్ఐసీ 8.62 శాతం, పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్) 9.30 శాతం నష్టాలతో ఇన్వెస్టర్ల సొమ్మును ఆవిరి చేశాయి.

విశ్లేషకులు ఏమంటున్నారు?

మార్కెట్ నిపుణులు దీపక్ జసాని అభిప్రాయం ప్రకారం.. ఈ రెండు సంస్థల ఐపీఓల విజయం పూర్తిగా కంపెనీలు నిర్ణయించే ధర (ప్రైసింగ్) పైనే ఆధారపడి ఉంటుంది. కంపెనీలు ఇన్వెస్టర్లకు కొంత లాభం మిగిల్చేలా ధరను నిర్ణయిస్తేనే లిస్టింగ్ రోజున మెరుపులు కనిపిస్తాయి. పెద్ద ఐపీఓల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల (ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్) కోటా కేటాయింపుల్లోనే పూర్తయిపోతుంది. దానివల్ల లిస్టింగ్ తర్వాత మార్కెట్లో కొత్తగా కొనుగోలు చేసేవారు తగ్గిపోయి, షేరు ధర పెరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది.

షార్ట్ టర్మ్ వద్దు.. లాంగ్ టర్మ్ వ్యూహమే మేలు

ఎస్బీఐ క్యాప్స్ సెక్యూరిటీస్ నిపుణులు సన్నీ అగర్వాల్ ప్రకారం, పెద్ద ఐపీఓల్లో లిస్టింగ్ రోజే బంపర్ లాభాలు ఆశించడం సరైన వ్యూహం కాదు. ఐపీఓ సైజ్ చాలా పెద్దది కావడం వల్ల మార్కెట్లో షేర్ల సరఫరా ఎక్కువగా ఉంటుంది. జియో, ఎన్ఎస్ఈ రెండు కూడా తమ రంగాలోనే తిరుగులేని దిగ్గజాలు. కాబట్టి కంపెనీల భవిష్యత్తు వ్యాపార వృద్ధిని నమ్మి సుదీర్ఘకాలం పాటు పెట్టుబడిని కొనసాగిస్తేనే మంచి రాబడులు అందుకోవడానికి వీలవుతుంది.

Tags: