Samsung Layoffs: సాఫ్ట్వేర్ రంగంలో భారీ లేఆఫ్స్.. 10 రోజుల్లో 6500 మందికి షాకిచ్చిన దిగ్గజ కంపెనీలు
దిగ్గజ కంపెనీలు
Samsung Layoffs: ఉద్యోగస్తులకు సెప్టెంబర్ నెల చేదు అనుభవంతో మొదలైంది. గ్లోబల్ టెక్ దిగ్గజం శామ్‌సంగ్ భారత్‌లోని తన టీవీ, గృహోపకరణాల విభాగం నుంచి దాదాపు 80 నుంచి 100 మంది ఉన్నతాధికారులను ఇంటికి పంపించే ప్రక్రియను ప్రారంభించడంతో గ్లోబల్ టెక్ ప్రపంచంలో ఒక్కసారిగా ఆందోళన తీవ్రమైంది. భారత మార్కెట్లో శామ్‌సంగ్ సంస్థ అత్యున్నత హోదాల్లో ఉన్న అధికారులను తొలగిస్తుండడం గమనార్హం. ముఖ్యంగా టెలివిజన్, హోమ్ అప్లయెన్సెస్ విభాగాల్లో డైరెక్టర్ స్థాయి అధికారులు, టీమ్ హెడ్‌లు, రీజినల్ మేనేజర్లపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడింది. ఈ ప్రక్రియను విడతల వారీగా అమలు చేస్తున్నారు. కొందరు ఉద్యోగులకు నోటీస్ పీరియడ్ పూర్తి చేసే అవకాశం కూడా ఇవ్వకుండా వెంటనే నిష్క్రమించాల్సిందిగా కంపెనీ సూచించినట్లు సమాచారం. దీపావళి పండుగ తర్వాత మిగిలిన విభాగాల్లో కూడా పునఃసమీక్ష జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
పది రోజుల్లోనే వేలాది మంది రోడ్డున
కేవలం సెప్టెంబర్ మొదటి పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వివిధ టెక్ కంపెనీల నుంచి దాదాపు 6,300 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్ తమ మొత్తం సిబ్బందిలో 10 శాతం, అంటే దాదాపు 3,300 మందిని తీసివేసే యోచనలో ఉంది. ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేపాల్ భారత్‌లోని తమ ఉద్యోగుల్లో 4 శాతాన్ని (సుమారు 220 మందిని) ఇంటికి సాగనంపేందుకు సిద్ధమైంది. వీటితో పాటు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో, ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్ కలసి దాదాపు 250 ఉద్యోగాలను రద్దు చేశాయి. ఒరాకిల్ సంస్థ కూడా భారీగా సిబ్బందిని తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ఎందుకు ఈ లేఆఫ్స్?
కంపెనీలు ఈ స్థాయిలో కొలువులకు కోత పెట్టడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా పెరుగుతున్న నిర్వహణ వ్యయాలే. శామ్‌సంగ్ విషయానికి వస్తే, మెమరీ చిప్‌ల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం, ముడిసరుకు కొనుగోలు ఖర్చులు భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు గతంతో పోలిస్తే మందగించడం కూడా ఈ వ్యాపార ఒత్తిడికి మరొక కారణం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం, అతి నియమకాలు
కంపెనీలు ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులను పక్కనబెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, క్లౌడ్ టెక్నాలజీలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దీనివల్ల గతంలో ఎక్కువ మంది ఉద్యోగులు చేసే పనులను ఇప్పుడు ఏఐ సాఫ్ట్‌వేర్లు సులువుగా పూర్తి చేస్తున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో విపరీతంగా చేసుకున్న ఉద్యోగుల నియమకాలను సరిదిద్దుకునే ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు ఈ తొలగింపులు జరుగుతున్నాయి.