Jio IPO: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ షేర్ల కేటాయింపు ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. సోమవారంతో ఈ ప్రాసెస్ కంప్లీట్ కాగా, మంగళవారం రోజున విజయవంతమైన మదుపర్ల డీమ్యాట్ ఖాతాలకు షేర్లు జమ అయ్యాయి. ఒకవేళ షేర్లు పొందని వారికి బ్లాక్ చేసిన డబ్బు అదే రోజున బ్యాంక్ ఖాతాలకు రిఫండ్ లేదా అన్‌బ్లాక్ చేయడం జరిగింది. సరిగ్గా దీని తర్వాత రోజు అంటే అక్టోబర్ 28 బుధవారం రోజున నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో జియో షేర్లు అధికారికంగా లిస్ట్ కానున్నాయి.

ఒక్కో లాట్‌పై భారీ లాభం

మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం లిస్టింగ్ రోజున మదుపర్లకు అద్భుతమైన లాభాలు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో జియో ఐపీఓ జీఎంపీ దాదాపు రూ.245 పైన ట్రేడవుతోంది. కంపెనీ నిర్ణయించిన అప్పర్ ప్రైస్ బ్యాండ్ రూ.1,119 తో పోలిస్తే, లిస్టింగ్ ధర సుమారు రూ.1,364 వరకు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీనివల్ల తొలిరోజే ఇన్వెస్టర్లకు దాదాపు 21.89 శాతం మేర లాభం దక్కే ఛాన్స్ ఉంది. ఒక లాట్ కింద 12 షేర్లు దక్కించుకున్న రిటైల్ ఇన్వెస్టర్‌కు దాదాపు రూ.2,939 వరకు నికర లాభం అందే అవకాశం కనిపిస్తోంది.

అలామెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం

ఈ ఐపీఓకు మార్కెట్లో అసాధారణ స్పందన లభించింది. మొత్తం 30,213 కోట్ల రూపాయల ఈ ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ వచ్చి పడింది. సంస్థాగత మదుపర్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లతో పాటు రిటైల్ విభాగంలోనూ దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఒకవేళ మీకు షేర్లు వచ్చాయో లేదో తెలుసుకోవాలనుకుంటే, కేఫిన్ టెక్నాలజీస్ అధికారిక పోర్టల్ లేదా బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ వెబ్‌సైట్లలోకి వెళ్ళవచ్చు. అక్కడ మీ అప్లికేషన్ నెంబర్ లేదా పాన్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయడం ద్వారా స్టేటస్ సులభంగా చెక్ చేసుకోవచ్చు.

భారీ అప్పుల నుంచి విముక్తి

ఈ ఐపీఓ ద్వారా సేకరించిన మొత్తం నిధులను కంపెనీ ఎంతో వ్యూహాత్మకంగా ఉపయోగిస్తోంది. ఇందులో ఎలాంటి ఆఫర్ ఫర్ సేల్ లేకపోవడం విశేషం. అంటే ప్రమోటర్లు ఎవరూ తమ వాటాలను అమ్మి డబ్బు వెనక్కి తీసుకోవడం లేదు. మొత్తం నిధులు నేరుగా జియో సంస్థ వద్దకే వెళ్లనున్నాయి. ఇందులో నుంచి సుమారు 27,500 కోట్ల రూపాయలను రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సబ్సిడరీ అప్పులను పూర్తిగా తీర్చడానికి కేటాయించారు. దీనివల్ల కంపెనీ బ్యాలెన్స్ షీట్ మరింత పటిష్టమై, భవిష్యత్ వృద్ధికి బలమైన పునాది పడుతుంది.

Tags: